Begin typing your search above and press return to search.

అదే మాటను కేసీఆర్ తో చెప్పొచ్చుగా వినోద్

By:  Tupaki Desk   |   28 Sept 2016 10:27 AM IST
అదే మాటను కేసీఆర్ తో చెప్పొచ్చుగా వినోద్
X
కొందరు నేతలు చెప్పే మాటలు చిత్రంగా ఉంటాయి. అధికారంలో ఉన్న తాము చేయలేని వాటిని.. ఎదుటోళ్లు చేయాలని కోరే తీరు కనిపిస్తుంది. తాజాగా టీఆర్ ఎస్ ఎంపీ వినోద్ కుమార్ మాటలే ఇందుకు నిదర్శనం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాల్ని ఏడాదికి 80 రోజుల కంటే ఎక్కవనే ఏర్పాటు చేయాలంటూ అప్పటి ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ ఎస్ డిమాండ్ చేసేది. తమ పోరాటం ఫలించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే.. ఏడాదికి వంద రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్న బడాయి మాటల్ని టీఆర్ ఎస్ నేతలు చెప్పేవారు.

వారు కోరుకున్నట్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావటమే కాదు.. అధికారపక్షంగా అదే పార్టీ అవతరించింది. మరి.. ఇలాంటప్పుడు ఏడాదిలో వందరోజులు అసెంబ్లీ సమావేశాల్ని ఎందుకు నిర్వహించన‌ట్లు? అనే సందేహానికి సమాధానం చెప్పే వారు కనిపించరు. ఇదిలా ఉంటే.. తాజాగా లోక్ సభ స్పీక‌ర్‌ సుమిత్రా మహాజన్ కు ఎంపీ వినోద్ ఒక ఆసక్తికరమైన లేఖను రాశారు. పార్లమెంటు సమావేశానికి సమావేశానికి మధ్య వ్యవది ఎక్కువగా ఉందని.. అందుకే ప్రతి నెలా పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని ఆయ‌న ఆ లేఖ‌లో కోరారు.

అంతేకాదు.. ఆస్ట్రేలియాలో జనవరి - ఏప్రిల్ - జులై మినహా మిగిలిన అన్ని నెలల్లో సోమవారం నుంచి గురువారం వరకూ సమావేశాలు నిర్వహిస్తారంటూ ఉదాహరణను కూడా చెప్పుకొచ్చారు. లోక్ సభ స్పీకర్ కు సలహా ఇచ్చే ముందు.. తమ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇలాంటి విషయాల్నే చెప్పి.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని ప్రతి నెలా సమావేశపరిచేలా ఐడియా ఇస్తే బాగుంటుంది కదా. దాన్నే ఉదాహరణగా చూపిస్తూ.. వినోద్ కుమార్ లోక్ సభ స్పీకర్ దృష్టికి తీసుకెళితే మరింత బాగుంటుంది కదా. తాము చేయని పనుల్ని.. ఎదుటోళ్లు మాత్రం చేయాలని చెప్పటం ఎంత వరకు ధర్మమన్నది వినోద్ కుమార్ ఆలోచిస్తే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/