Begin typing your search above and press return to search.

ఎంపీ ఇంటిపై బాంబులు.. తమిళనాడులో తీవ్ర కలకలం

By:  Tupaki Desk   |   25 Nov 2020 9:50 AM GMT
ఎంపీ ఇంటిపై బాంబులు.. తమిళనాడులో తీవ్ర కలకలం
X
తమిళనాడులోని ఓ ఎంపీ ఇంటిపై కొందరు దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు. అయితే బాంబు పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ ఈ ఘటన మాత్రం తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అన్నాడీఎంకే చెందిన రాజ్యసభ సభ్యుడు విజయకుమార్‌ నివాసం కన్యాకుమారి జిల్లా నాగర్‌ కోయిల్‌లోని కలెక్టరేట్‌ సమీపంలో ఉన్నది. అయితే ఆయన కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉన్నప్పుడే దుండగులు ఓ బాంబ్​ ను విసిరారు. ఒక వేళ బాంబ్​ పేలి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని పోలీసులు పేర్కొన్నారు.

ఎంపీ విజయ్​కుమార్​ ప్రతిరోజు తెల్లవారు జామున తన ఇంటి నుంచి కారులో బయటకు వస్తారు. సమీపంలోని ఓ మైదానంలో ఆయన వాకింగ్​ చేస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న దుండగులు మంగళవారం తెల్లవారుజామున ఎంపీ ఇంట్లోకి బాంబు విసిరారు. అయితే ఆ సమయంలో ఎంపీ ఇంట్లో లేరు. ఆయన ఇటీవల ఢిల్లీ వెళ్లారు. పైగా బాంబ్​ కూడా పేలలేదు దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఇంటికి వచ్చిన కారు డ్రైవర్​ బాంబును గుర్తించి కుటుంబసభ్యులకు చెప్పారు. వారు పోలీసులకు సమాచారం అందించారు.

అక్కడికి చేరుకున్న డీఎస్పీ వేణుగోపాల్​ బాంబును గుర్తించి ల్యాబ్​ కు పంపించారు. ఎంపీ ఇంటిపై కావాలనే దుండగులు బాంబు దాడికి యత్నించినట్టు ఆయన చెప్పారు. అయితే ఈ బాంబు దాడి వెనక ఎవరు ఉన్నారు.. అన్న విషయం పై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. త్వరలో తమిళనాడు లో ఎన్నికలు జరుగుతున్న వేళ ఇటువంటి ఘటన తీవ్ర కలకలం రేపింది. నిజానికి విజయ్​ కుమార్​ సౌమ్యుడి గా పేరుంది.