Begin typing your search above and press return to search.

ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేశారా?

By:  Tupaki Desk   |   19 Aug 2019 10:39 AM IST
ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేశారా?
X
కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ కలకలం మరోమారు చోటు చేసుకుంది. ఆపరేషన్ కమలంలో భాగంగా కన్నడ గడ్డ మీద కమలనాథుల కాషాయజెండా ఎగురవేయాలన్న స్వప్నాన్ని తీర్చేందుకు ఎంతకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించింది బీజేపీ అధినాయకత్వం. తాము అనుకున్నట్లే బీజేపీ ప్రభుత్వాన్ని కొలువు తీర్చే వరకూ నిద్రపోని కమలనాథులు.. ప్రభుత్వ ఏర్పాటు తర్వాతైనా ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి.

తాము ఏ రీతిలో అయితే తమ రాజకీయ ప్రత్యర్థులకు కంటి నిండా కునుకు లేకుండా ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందోనన్న భయాందోళనల మధ్య బతికేలా చేసిన తీరులోనే.. ఇప్పుడూ అలాంటి పరిస్థితులే చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారాలు కూడా కాకముందే కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. తమ ఫోన్లను ట్యాప్ అయ్యాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పజెప్పారు. ఈ ఉదంతంపై తాజాగా స్పందించారు ఎంపీ సుమలత. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించటం మంచిదే. ఎవరు దీన్ని చేశారన్న విషయాలు బయటకు వస్తాయన్నారు. తన ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందేమోనన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు.

దేశంలో మరెక్కడా చోటు చేసుకోని రీతిలో కర్ణాటకలో సుమారు 300 మంది ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించిన ఆమె.. ఆరోపణలు రావటంతో కేసు నమోదు చేశారన్నారు. వాస్తవాలు వెలుగు చూస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ఆమె.. పార్లమెంటు ఎన్నికల సమయంలో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా ఆమె చెప్పారు. మరి.. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.