Begin typing your search above and press return to search.

మోడీతో భేటీ: సుజనా వెళ్లారు.. వచ్చారు..

By:  Tupaki Desk   |   6 Feb 2018 6:51 AM GMT
మోడీతో భేటీ: సుజనా వెళ్లారు.. వచ్చారు..
X
మోడీ తన రాజకీయ అనుభవాన్ని - చాణక్య తెలివితేటలను చాలా అద్భుతంగా ప్రదర్శించారు. బడ్జెట్ కేటాయింపుల గురించి తెలుగుదేశం పార్టీ ఎంపీలంతా నిరసనలు వ్యక్తంచేస్తోంటే.. వారి ఆవేదన వినడానికి స్వయంగా తాను అపాయింట్ మెంట్ ఇచ్చారు. కానీ కలవడానికి ఒక్క సుజనా చౌదరిని మాత్రమే అనుమతించారు. సుజనా చౌదరి అంటే.. ఆయన ప్రభుత్వంలో మంత్రి. మోడీ ముందు గట్టిగా గళం వినిపించే అవకాశం ఎంతమాత్రమూ లేదు. మోడీ సర్కారు చూపిస్తున్న వివక్ష మీద ఆగ్రహంతో ఊగిపోతున్న తెదేపా ఎంపీల్లో ఏ ఒక్కరికీ అవకాశం ఇవ్వకుండా.. సుజనాను మాత్రం అనుమతంచడంలోనే మోడీ లౌక్యం బయటపడుతున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎంపీలందరూ పార్లమెంటు బయట ప్లకార్డులు పెట్టుకుని గోల చేస్తుండగా.. సుజనా మాత్రం ప్రధాని ని కలిశారు. దాదాపుగా 20 నిమిషాలు భేటీ అయినట్లుగా చెబుతున్నారు. విభజన చట్టంలోని హామీలు అన్నిటినీ నెరవేర్చడం గురించి ఆయన విజ్ఞప్తి చేశారని, బడ్జెట్ కేటాయింపుల్లోనూ అన్యాయం జరిగిందని ప్రస్తావించారని వార్తలు వస్తున్నాయి. మరి ప్రధానితో భేటీ అయిన తర్వాత.. సుజనా చౌదరి మీడియాతో మాట్లాడలేదు. మంచి చెడులన్నీ బేరీజు వేసుకుని.. ఏం మాట్లాడాలో.. ఏం మాట్లాడకూడదో సమీక్షించుకున్న తర్వాత.. తనకు తోచిన రీతిలో మీడియాకు బ్రీఫింగ్ ఇస్తారేమో అని పలువురు అనుకుంటున్నారు.

నిజానికి తెదేపా తరఫున ఒక్క సుజనా చౌదరిని మాత్రమే ప్రధానిని కలవడానికి అనుమతించినప్పుడే.. వ్యవహారం బెడిసికొడుతోంది అని అంతా అనుకున్నారు. ఇప్పటిదాకా సుజనాచౌదరి తాను కేంద్రంతో దౌత్యం నిర్వహించిన ఏ విషయంలోనూ రాష్ట్రానికి న్యాయం జరిగిన దాఖలాలులేవు అనేది పలువురి పరిశీలన. అది రాష్ట్రానికి పట్టిన ఖర్మం కావచ్చు.. యాదృచ్ఛికం కావొచ్చు.. గతంలో పలుమార్లు కేంద్రంతో బెడిసికొట్టిన అనేక దౌత్యాలు సుజనా నేతృత్వంలోనే జరిగాయి. ప్రత్యేకహోదా అనేది అయిపోయిన ఎపిసోడ్ అంటూ వ్యాఖ్యానించి.. ప్రత్యేకప్యాకేజీ చర్చల్లో పాల్గొని అరుణ్ జైట్లీతో ప్యాకేజీ ప్రతిపాదనలు తయారుచేయించింది కూడా సుజనానే. వాటికి కూడా ఇవాళ్టి దాకా అతీగతీ లేదు. ఇప్పుడు మోడీతో భేటీ కి కూడా ఆయనొక్కరే వెళ్లడంతో తెదేపా ఎంపీల నిరసనల ఫలితమంతా గంగలో పోసినట్లేనని.. దక్కేదేమీ ఉండదని.. సుజనా మంతనాల వల్ల ఏమీ ఒరగదని పలువురు పార్టీ వారే వ్యాఖ్యానిస్తున్నారు.