Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ అధ్యక్ష ప‌ద‌వి రేసులో ఆ వివాదాస్ప‌ద నేత‌?

By:  Tupaki Desk   |   30 Aug 2022 9:38 AM GMT
కాంగ్రెస్ అధ్యక్ష ప‌ద‌వి రేసులో ఆ వివాదాస్ప‌ద నేత‌?
X
కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్ట‌డానికి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీ మొగ్గుచూప‌ని సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లోత్ పేరు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌వికి ఇటీవ‌ల వినిపించింది. అయితే ఆయ‌న కూడా రాజ‌స్థాన్‌లో ముఖ్య‌మంత్రిగా ఉండ‌టమే త‌న‌కు ఇష్ట‌మంటూ అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్టడానికి ఇష్ట‌ప‌డ‌లేదు. ఈ నేప‌థ్యంలో కేర‌ళ‌లోని తిరున‌వంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ పేరు కాంగ్రెస్ అధ్యక్ష ప‌ద‌వికి వినిపిస్తోంది.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా శ‌శి థ‌రూర్ ఒక ప‌త్రిక‌కు రాసిన వ్యాసంలో పేర్కొన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే శ‌శి థ‌రూర్‌కు పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డానికి సోనియా, రాహుల్ అంగీక‌రిస్తారా అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎందుకంటే పార్టీలో సంస్థాగ‌త మార్పుల‌ను సూచిస్తూ.. గ‌తంలో కాంగ్రెస్ అధిష్టానంపై లేఖ‌లు సంధించిన జీ-23 కాంగ్రెస్ నేత‌ల్లో శ‌శి థ‌రూర్ ఒక‌రిగా ఉన్నారు. జీ-23 నేత‌ల్లో ఒక‌రిగా ఉన్న గులాం న‌బీ ఆజాద్ ఇటీవ‌ల కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ ప్ర‌చార క‌మిటీ అధ్యక్షుడిగా ఉన్న ఆనంద్ శ‌ర్మ కూడా రాజీనామా చేశారు. ఈయ‌న కూడా జీ-23 నేత‌ల్లో ఒక‌రు.

గాంధీల కుటుంబానికి అత్యంత విశ్వాస‌పాత్రులైన‌వారినే అధ్య‌క్ష ప‌ద‌వికి ఎంపిక చేసే వీలుంది. ఈ నేప‌థ్యంలో శ‌శి థ‌రూర్‌కు అవ‌కాశాలుంటాయా అనే దానిపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ ఓ పత్రికలో రాసిన వ్యాసం ద్వారా తాను అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్ట‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్టు సూచన ప్రాయంగా సంకేతాలు ఇచ్చారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి చాలా మంది ముందుకు వస్తారంటూ అభిప్రాయం వ్యక్తం చేయడం ద్వారా శ‌శి థ‌రూర్ తన మనసులోని మాటను చెప్పారంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీల మొగ్గు మాత్రం అశోక్ గెహ్లోత్ మీదే ఉందంటున్నారు.

కాగా అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగితే దేశవ్యాప్తంగా దాని ప్రభావం ఉంటుందని శ‌శి థరూర్ తాను ప‌త్రిక‌కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఇందుకు ప్రస్తుతం బ్రిటన్‌ ప్రధాని పదవి కోసం అధికారిక కన్జర్వేటివ్‌ పార్టీలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను ఆయన ఉదాహరణగా చూపించారు. ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోవడానికి ఆ పార్టీలో జరుగుతున్న ఎన్నిక ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆస‌క్తిని రేకెత్తించింద‌ని ఆయ‌న గుర్తు చేస్తున్నారు. అలాంటి ప్రయత్నమే కాంగ్రెస్‌లోనూ జరగాల్సి ఉందని అంటున్నారు. అభ్యర్థులు తమ విజన్‌ను పార్టీ ముందు ఉంచితే తప్పనిసరిగా అది ప్రజల్లో ఆసక్తి కలిగిస్తుందని శ‌శి థ‌రూర్ అభిప్రాయంగా ఉంది. కాగా త‌న పోటీ విషయమై ఇప్పటికే ఆయన పలువురు కాంగ్రెస్ నాయకులతో చర్చలు జర‌ప‌డం విశేషం.

కాగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విషయంలో ప్రస్తుతం కొంత శూన్యత నెలకొందని శ‌శి థరూర్‌ తన వ్యాసంలో అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ శూన్య‌త‌ నుంచి బయటపడాలంటే పార్టీలో ఒక కదలిక తీసుకు రావాల‌ని శ‌శి థ‌రూర్ సూచిస్తున్నారు. అందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ప‌ద‌వికి జ‌రిగే ఎన్నికలు ఉపకరిస్తాయని అభిప్రాయపడుతున్నారు. స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహిస్తే అది కార్యకర్తలు, తద్వారా ప్రజలపై ప్రభావం చూపుతుందని శ‌శి థ‌రూర్ నొక్కి వ‌క్కాణిస్తున్నారు. కార్యకర్తల్లో పునరుత్తేజం రావాలంటే పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించడం మేలని ఆయ‌న ఘంటాప‌థంగా చెబుతున్నారు.

ఒక వేళ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి చాలా మంది అభ్యర్థులు పోటీ పడితే ఎన్నిక నిర్వహిస్తారు. అదే జరిగితే 22 ఏళ్ల తరువాత ఆ పదవికి ఎన్నిక జరిగినట్టు అవుతుంది. 2000 నవంబరులో సోనియా గాంధీపై జితేంద్ర ప్రసాద పోటీ చేశారు. సోనియాకు 7,542 ఓట్లు రాగా, జితేంద్రకు కేవలం 94 మాత్రమే వచ్చాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తి కోసమే పోటీ చేసినట్టు ఆ సందర్భంగా ఆయన ప్రకటించ‌డం గ‌మ‌నార్హం.

కాగా శ‌శి థ‌రూర్ 2009, 2014, 2019 ఎన్నిక‌ల్లో తిరువ‌నంత‌పురం నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు. సునంద పుష్క‌ర్ అనుమానాస్ప‌ద మృతిలో శ‌శి థ‌రూర్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆమెది స‌హ‌జ మ‌ర‌ణం కాద‌ని.. హ‌త్యేన‌ని క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. కాగా శ‌శి థ‌రూర్.. మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌భుత్వ హ‌యాంలో కేంద్ర విదేశాంగ స‌హాయ మంత్రిగా పనిచేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.