Begin typing your search above and press return to search.

4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు.. ఆ రాష్ట్రంలో 12వేల ఫైళ్లు దగ్థం

By:  Tupaki Desk   |   14 Jun 2023 12:00 PM GMT
4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు.. ఆ రాష్ట్రంలో 12వేల ఫైళ్లు దగ్థం
X
మరో నాలుగు నెలల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగున్నాయి. తెలంగాణ రాష్ట్రంతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆ రాష్ట్రం ఒకటి. అలాంటిది ఆ రాష్ట్ర ప్రభుత్వ కీలక కార్యాలయంలో తాజాగా జరిగిన అగ్నిప్రమాదంలో ఏకంగా 12వేల ఫైళ్లు దగ్థం కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోని సాత్పురా భవన్ లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది చివర్లోజరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కావాలనే కుట్రపూరితంగా ముఖ్యమైన ఫైళ్లను తగలబెట్టేశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

అగ్నిప్రమాదంపై విపక్ష కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై.. బీజేపీ సర్కారు స్పందించింది. అతి ముఖ్యమైన ఫైళ్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆరు అంతస్థులభవనంలోని 4,5,6 అంతస్థుల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం సంచలనంగా మారింది. ఈ భవనంలో అనేక మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఉండటం గమనార్హం.

ఈ అగ్నిప్రమాదం నేపథ్యంలో.. భారీగా మంటలు చెలరేగటం.. వాటిని చల్లార్చేందుకు పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది.. విపత్తు నివారణ సిబ్బంది మొత్తం 12 గంటల పాటు శ్రమించి.. మంటల్ని అదుపు చేశారు. ఇక్కడో షాకింగ్ నిజాన్ని ప్రస్తావించాలి.

ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగటానికి కాస్త ముందుగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకొని.. భారీ ఎత్తున ఫైళ్లు తగలబడిపోవటం విశేషం. 2012, 2018లోనూ అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ముందుగా అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సమయంలో సదరు భవనంలో 4 వేల మంది సిబ్బంది ఉన్నట్లు చెబుతున్నారు. ఏసీలో పేలుడే ఈ అగ్నిప్రమాదానికి కారణమని చెబుతున్నారు.ఈ ప్రమాదంపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలకు దిగాయి.

దీంతో.. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నారు. తాజా అగ్నిప్రమాదంలో 12 వేల ఫైళ్లు తగలబడ్డాయని చెబుతున్నారని.. నిజంగానే అగ్నిప్రమాదమా? ఎవరైనా కావాలనే చేశారా? దీని వెనుకు ఉన్న కథేంటి? దీన్ని తేల్చాలంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్ ఆరోపించటం గమనార్హం.