Begin typing your search above and press return to search.

గురువును అరెస్ట్ చేసిన వ్య‌క్తిని మంత్రిని చేసిన మోడీ

By:  Tupaki Desk   |   31 May 2019 5:22 AM GMT
గురువును అరెస్ట్ చేసిన వ్య‌క్తిని మంత్రిని చేసిన మోడీ
X
గ‌తాన్ని అంత తేలిగ్గా మ‌ర్చిపోర‌న్న మాట మోడీ విష‌యంలో త‌ర‌చూ చెబుతుంటారు. అప్పుడెప్పుడో తాను గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఏపీ సీఎంగా ఉన్న చంద్ర‌బాబు చేసిన ప‌నిని దృష్టినిలో ఉంచుకొని.. ఆయ‌న్ను అదే ప‌నిగా వ్య‌తిరేకిస్తార‌న్న మాట మోడీ స‌న్నిహితులు చెబుతుంటారు. అంతేనా.. త‌న‌కు సాయం చేసిన వారిని సైతం మోడీ అంత తేలిగ్గా మ‌ర్చిపోర‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది.

దీనికి ఉదాహ‌ర‌ణ‌గా గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఉదంతాన్ని ప్ర‌స్తావిస్తుంటారు. గ‌తంలో ఆయ‌న చేసిన మేలుకు వ‌డ్డీతో స‌హా తాజాగా తీర్చేసుకుంటున్న‌ట్లుగా ప‌లువురు చెబుతుంటారు. మ‌రి.. అలాంటి మోడీ.. త‌న‌కు రాజ‌కీయ భిక్ష ప్ర‌సాదించి.. తాను గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి అయ్యేందుకు అవ‌కాశం ఇచ్చిన అద్వానీ విష‌యంలో ఎందుకంత క‌టువుగా ఉంటార‌న్న‌ది చాలామందికి అర్థంకాని ప్ర‌శ్న‌గా ఉంటుంది.

వ‌య‌సు పేరు చెప్పి ఇప్ప‌టికే అద్వానీని ప‌క్క‌న పెట్టేసిన మోడీ.. ఈసారి ఆయ‌న‌కు మంట పుట్టేలా మ‌రో నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ర‌థ‌యాత్ర‌తో దేశ వ్యాప్తంగా త‌న‌కు.. త‌న పార్టీకి అంతులేని ఇమేజ్ తెచ్చిన పెట్టిన అద్వానీని.. అరెస్ట్ చేసిన ఒక అధికారిని తాజాగా త‌న మంత్రివ‌ర్గంలో స్థానం క‌ల్పించ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ప్ర‌ధానిగా రెండో ద‌ఫా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన మోడీ.. తన మంత్రివ‌ర్గాన్ని కొలువు తీర్చ‌టం తెలిసిందే. ఒకేసారి 57 మందితో కొలువు తీరిన మోడీ.. త‌న మంత్రివ‌ర్గంలో ఒక మాజీ ఐఏఎస్ అధికారికి అవ‌కాశం ఇవ్వ‌టం చ‌ర్చనీయాంశంగా మార్చింది. యూపీఏ ప్ర‌భుత్వంలో కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శిగా ప‌ని చేసిన ఐఏఎస్ అధికారి రాజ్ కుమార్ సింగ్ బిహార్ లో ఎల్ కే అద్వానీ ర‌థ‌యాత్ర ప్ర‌వేశించిన స‌మ‌యంలో నాటి సీఎం లాలూ ఆదేశాల‌తో ఆయ‌న్ను అరెస్ట్ చేశారు.

అప్ప‌ట్లో ఈ అంశం పెను సంచ‌ల‌నంగా మారింది. త‌న రాజ‌కీయ గురువు..తాను సీఎంగా ఉన్న వేళ గుజ‌రాత్ లో చోటు చేసుకున్న మ‌త ఘ‌ర్ష‌ణ‌ల వేళ‌.. త‌న‌ను దించేందుకు అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు వ‌స్తున్న వేళ‌.. వారంద‌రికి న‌చ్చజెప్పి త‌న ప‌ద‌వి పోకుండా కాపాడిన గురువుకు శిష్యుడు హోదాలో మోడీ భ‌లే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా కొంద‌రు గుస‌గుస‌లాడుకోవ‌టం క‌నిపిస్తోంది. ఏమైనా.. వినూత్న నిర్ణ‌యాలు తీసుకోవ‌టంలో మోడీ త‌ర్వాతే ఎవ‌రైనా.