Begin typing your search above and press return to search.

సందిగ్ధంలో రాజు గారు... ఇటు రానీయరు, అటెళ్లలేరు

By:  Tupaki Desk   |   15 Sep 2020 5:00 AM GMT
సందిగ్ధంలో రాజు గారు... ఇటు రానీయరు, అటెళ్లలేరు
X
వైసీపీ టికెట్ పై మొన్నటి ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి ఎన్నికైన రఘురామకృష్ణంరాజు పరిస్థితి నిజంగానే ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయిందని చెప్పక తప్పదు. వైసీపీ ఎంపీగానే పార్లమెంటు లెక్కల్లో ఉన్న రాజు గారు.. ఆ పార్టీకి దూరమైపోయారు. అనవసర రాద్ధాంతం భుజానికెత్తుకున్న రాజు... సోమవారం పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఒంటరై కనిపించారు. తనకు వెన్నుదన్నుగా నిలుస్తున్న బీజేపీవైపో, లేదంటే టీడీపీ వైపో వెళ్లలేక, ఇటు వైసీపీ తనను దగ్గరకు రానీయని పరిస్థితిలో నిజంగానే రాజు ఒంటరైపోయారని చెప్పాలి.

సోమవారం పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా రాజు గారు... వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి వెళ్లాల్సి ఉంది. ఈ మేరకు పార్టీ తరఫున ఆయనకు ఆహ్వానం అందినట్లు ఏపీ భవన్ అదికారులు సమాచారం కూడా అందించారు. అయితే ఏమైందో, ఏమో తెలియదు గానీ... ఆ సమావేశానికి రావద్దన్నారని ఏపీ భవన్ అధికారులే ఆయన ముకం మీదే చెప్పేయడంతో రాజు గారు స్థాణువైపోయారు. సరే... వద్దన్న సమావేశానికి వెళ్లలేరు కదా... మరేం చేయాలి? ఏదో తనకు పరిచయం ఉన్న పార్టీ నేతలో, లేదంటే కేంద్ర మంత్రులో, లేదంటే... ఆయా శాఖల అధికారుల వద్దకో వెళ్లాలి.

ఈ నేపథ్యంలో రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని, ఈ విషయంపై మీరైనా కాస్త దృష్టి సారించండి అని కోరేందుకు టీడీపీ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోం శాఖ కార్యదర్శి వద్దకు వెళ్లారు. రాజు గారు కూడా హోం శాఖ కార్యదర్శి వద్దకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. విషయం కూడా టీడీపీ కోరుతున్నదే. అయినా కూడా రాజు గారు టీడీపీ ఎంపీలతో కలిసి వెళ్లలేకపోయారు. టీడీపీ ఎంపీలు కేంద్ర హోం శాఖ కార్యాలయానికి వెళ్లి వచ్చాక గానీ... రాజు గారు ఆ కార్యాలయం గడప తొక్కలేకపోయారు. మొత్తంగా ఇటు టీడీపీ వైపు వెళ్లలేక, అటు తనను ఎంపీగా గెలిపించిన వైసీపీ తనను దగ్గరకు రానీయకపోవడంతో సోమవారం నాడు రాజు గారు నిజంగానే ఓంటరిగా కనిపించారు.