Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌పై ఎంపీ ర‌ఘురామ ఎఫెక్ట్‌..!

By:  Tupaki Desk   |   27 Aug 2021 7:57 AM GMT
టాలీవుడ్‌పై ఎంపీ ర‌ఘురామ ఎఫెక్ట్‌..!
X
ఏపీలో క‌రోనా అనంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌.. ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వాల నుంచి కొంత ఉప‌శ‌మ‌నం కోరుకుంటున్న ప‌రిస్థితి తెలిసిందే. దీనికి సంబంధించి ఏపీ ప్ర‌భుత్వం కూడా టాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో చ‌ర్చించేందుకు సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే మంత్రి పేర్ని నాని.. చిరంజీవి వంటి ప్ర‌ముఖుల‌కు ఆహ్వానాలు కూడా పంపించారు. రండి.. చ‌ర్చిద్దాం! అంటూ.. వారిని స్వాగ‌తించారు. అయితే.. ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సిమ్లా ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌డంతో ఆయ‌న అప్పాయింట్ మెంట్ ఇంకా ఖ‌రారు కాలేదు.

ఇక‌, టాలీవుడ్ కూడా జ‌గ‌న్ అప్పాయింట్ మెంట్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ఈ నెల ఆఖ‌రు వ‌రకు సీఎం జ‌గ‌న్ ఏపీకి చేరుకునే అవ‌కాశం లేదు. దీంతో వ‌చ్చే నెల‌తొలి వారంలో టాలీవుడ్ తో ఆయ‌న భేటీ అయ్యే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. ఇదిలావుంటే.. అనూహ్యంగా ఈ విష‌యంలో వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ రాజు జోక్యం చేసుకున్నారు. టికెట్ ధ‌ర‌ల‌ను ప్ర‌భుత్వం ఎలా నిర్ణ‌యిస్తుంద‌ని.. ఆయ‌న ప్ర‌శ్నించారు. మ‌ద్యం ధ‌ర‌ల‌ను ప్ర‌భుత్వం ఇష్టానుసారం పెంచుకుని.. సొమ్ము చేసుకుంటున్న‌ప్పుడు.. సినీరంగానికి మాత్రం స్వేచ్ఛ ఇస్తే త‌ప్పేంట‌ని ఆయ‌న ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ ప్ర‌శ్నించారు.

అంతేకాదు.. గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీ.. వ‌కీల్‌సాబ్ విష‌యంలోనూ ప్ర‌భుత్వం ఆంక్ష‌లు పెట్టింద‌ని.. త‌న ఆగ్ర‌హాన్ని సినిమాపై రుద్ద‌డంతో సినీ ప్రేక్ష‌కులు ఇబ్బందులు ప‌డ్డార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కీల‌క‌మైన సినీ హీరోను ముఖ్య‌మంత్రి ఇలా ఇబ్బందులు పెట్ట‌డాన్ని ప‌వ‌న్ అభిమానులు జీర్ణించుకోలేక పోయార‌ని చెప్పారు. అంతేకాదు.. ప్ర‌భుత్వ‌మే టికెట్ ధ‌ర‌లు నిర్న‌యిస్తే.. థియేట‌ర్లు.. ఎలా న‌డుస్తాయ‌ని ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికే ధియేట‌ర్లు న‌ష్టాల్లో ఉన్నాయ‌ని తెలిపారు. మ‌ద్యం కోసం 250 రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్న వారు.. 150 రూపాయ‌లు ఇచ్చి సినీ టికెట్ కొన‌లేర‌ని మీరెలా చెబుతార‌ని అన్నారు. ఇప్ప‌టికైనా ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌తో సీఎం చ‌ర్చించాల‌ని సూచించారు.

అయితే.. ఎంపీ ర‌ఘురామ త‌మ విష‌యంలో జోక్యం చేసుకోవ‌డంపై టాలీవుడ్ ప్ర‌ముఖులు ఒకింత నచ్చడం లేదట. ఎందుకంటే.. ఇప్పుడు ఎంపీ ర‌ఘురామ‌పై అధికారపార్టీ నేత‌లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్ర‌మంలో త‌మ‌కు ర‌ఘురామ నుంచి మ‌ద్ద‌తు కావాల‌ని సినీ ప్ర‌ముఖులు ఎవ‌రూ కోరుకోవ‌డం లేదు. ఆయ‌న వేలు పెడితే.. త‌మ స‌మ‌స్య మ‌రింత జ‌ఠిలం అవుతుంద‌ని వారు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ర‌ఘురామ వ్యాఖ్య‌ల‌పై టాలీవుడ్‌లో పెద్ద చ‌ర్చే సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.