Begin typing your search above and press return to search.

తీవ్రమైన వార్నింగ్ ఇచ్చేసిన ఎంపీ నందిగం

By:  Tupaki Desk   |   8 Nov 2020 5:30 AM GMT
తీవ్రమైన వార్నింగ్ ఇచ్చేసిన ఎంపీ నందిగం
X
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కమ్ ఫైర్ బ్రాండ్ నందిగం సురేశ్ కు కోపం వచ్చింది. తెలుగు తమ్ముళ్లు అదే పనిగా చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దళితులంతా ఒక్కటై నడుస్తుంటే.. అందుకు భిన్నంగా తెలుగు తమ్ముళ్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. అలాంటి వ్యాఖ్యల్ని సహించేది లేదన్నారు. సీఎం జగన్ పాలనలో దళితులకు మేలు జరుగుతుంటే.. అందుకు భిన్నంగా విష ప్రచారం చేస్తున్నారన్నారు.

ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలన్న లక్ష్యంతో.. చంద్రబాబు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని.. దళితులపై దాడులు జరుగుతున్నట్లుగా అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారన్నారు. పది మందిని పోగేసి.. దళితులపై దాడులు జరుగుతున్నాయంటూ ప్రచారం చేసేస్తే నమ్మేస్తారా? అని ప్రశ్నించారు.

కులాల కుంపట్లు పెట్టటంలో చంద్రబాబు ఆరితేరారని.. దళితుల కళ్లను దళితులతోనే పొడిపించాలన్నదే ఆయన ఆలోచనగా చెప్పారు. కొందరు దళిత నాయకులు బాబు తొత్తులుగా మారి.. మేధావులమంటూ మాట్లాడుతున్న మాటల్లోని నిజాలేమిటో ఇప్పటికే అర్థమయ్యయాని చెప్పారు. న్యాయంగా దళితుల ప్రయోజనాల కోసం ఆందోళనలు పోరాటాలు చేస్తే.. తాము కూడా మద్దతు ఇస్తామని.. అందుకు భిన్నంగా రాజకీయ ప్రయోజనాలకు దళితుల పేరును వాడుతుంటే మాత్రం ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు.