Begin typing your search above and press return to search.

బరస్ట్ అయిన నామా నాగేశ్వరరావు

By:  Tupaki Desk   |   20 March 2023 5:00 PM GMT
బరస్ట్ అయిన నామా నాగేశ్వరరావు
X
ఖమ్మం బీఆర్ఎస్ లో మళ్లీ అసంతృప్తి మొదలవుతోంది. మాజీ ఎంపీ పొంగులేటి రాజేసిన నిప్పు ఇప్పుడు ఇతర నేతలకు పాకుతోంది. నేతలు బహిరంగ విమర్శలకే దిగుతున్నారు. ఒక పక్క రెబల్ స్టార్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీకి దూరం జరుగుతుంటే ఇతర నేతలు కూడా ఐకమత్యం లేక ఎవరికీ వారే యుమునా తీరే అన్నట్లుగా తయారయ్యారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలుంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక చోట మాత్రమే గెలిచింది. ఖమ్మంలో గెలిచిన పువ్వాడ అజయ్, రవాణా మంత్రిగా సేవలందిస్తున్నారు. జిల్లాలో ఆయన ఏకపక్ష ధోరణిని ప్రదర్శిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఆయన తీరు కూడా బీఆర్ఎస్ నేతలకు ఇబ్బందిగా మారింది.

ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఇప్పుడు పువ్వాడ తీరుపై బహిరంగ అసంతృప్తిని వ్యక్తపరిచారు. నేరుగా పేరు చెప్పకపోయినా తనను ఏ కార్యక్రమానికి పిలవడం లేదంటూ ఆవేదన చెందారు. కేటీఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల్లో నామా చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్గాల్లో దుమారం రేపాయి. పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు తనను పిలవడం లేదని నామా నాగేశ్వరరావు చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ లో సంచలనమయ్యాయి.

ఎక్కడికి పిలిచినా వస్తానని చెప్పినా కూడా పిలవడం లేదని నామా నొచ్చుకున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో తనను కూడా భాగస్వామిని చేయాలని నామా స్థానిక నేతలను వేడుకోవడంతో అంతా షాక్ అయిన పరిస్థితి నెలకొంది. తనతో విభేదాలపై ఓపెన్ గా చెబితే సరిదిద్దుకుంటానని వివరించారు.

మొత్తంగా నామా వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ లో కొత్త చర్చకు దారితీశాయి. ఇప్పటికే పొంగులేటితో తలనొప్పిలు తెచ్చుకుంటున్న కేసీఆర్ కు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ నామా తీరు కూడా కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టడం ఖాయమని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.