Begin typing your search above and press return to search.

ముందస్తు ఎన్నికలపై తేల్చేసిన ఎంపీ మిథున్ రెడ్డి!

By:  Tupaki Desk   |   2 Jan 2022 11:00 PM IST
ముందస్తు ఎన్నికలపై తేల్చేసిన ఎంపీ మిథున్ రెడ్డి!
X
ఆలూ లేదు చూలు లేదు మొగుడు పేరు సోమలింగం అన్నట్లుగా మారింది ఏపీలో ఇటీవల జరుగుతున్న ముందస్తు ఎన్నికల చర్చ. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. 2024 మధ్య భాగం వరకు జగన్ సర్కారు పాలించేందుకు అవకాశం ఉంది. స్థిరమైన ప్రభుత్వం.. ప్రజల దన్ను ఉన్న వేళ.. ప్రభుత్వం ముందుగా ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరమే లేదు. అయినప్పటికీ.. ఇటీవల కాలంలో కొన్ని అంశాలకు విపరీతమైన ప్రాధాన్యత రావటమే కాదు.. చివరకు కీలక నేతలు సైతం దీనిపై మాట్లాడాల్సి వస్తోంది. ఏపీలో ముందస్తు ఎన్నికలు సైతం ఇదే తరహాలోకి వస్తాయని చెప్పొచ్చు.

ముందస్తుపై ఏపీ సీఎం ఆలోచనలు ఏమిటి? అసలు ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా? లాంటి ప్రశ్నలకు తాజాగా బదులిచ్చేశారు వైసీపీ లోక్ సభ పక్ష నేత కమ్ ఎంపీ మిథున్ రెడ్డి. సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. ప్రధాని మోడీతో భేటీ కానున్నారని.. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలు.. ప్రత్యేక హోదా.. పోలవరం గురించి మాట్లాడతారని చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా ముగిసిన ఎపిసోడ్ అని పార్లమెంటు సాక్షిగానే పలుమార్లు కేంద్రం తేల్చేసిన వేళ.. మోడీ ముందుకు వెళ్లి హోదా గురించి సీఎం జగన్ మాట్లాడతారా? అన్నది సందేహమే. ఇదిలా ఉంటే.. ముందస్తు ఎన్నికల మీద మిథున్ రెడ్డి స్పందిస్తూ.. ఈ వాదనల్ని పూర్తిగా కొట్టి పారేశారు.

ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ.. తాను ఈ వాదనల్ని విన్నట్లు చెప్పారు. మరోవైపు అచ్చెన్నాయుడు.. ఎంపీ రామ్మోహన్ నాయుడు సైతం ఈ అంశంపై మాట్లాడారు. అయితే.. ఈ వాదనలో నిజం లేదన్నారు. పార్టీని కాపాడుకోవటానికే చంద్రబాబు తరచూ ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతుంటారని పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసిన ఆయన.. ఐదేళ్లు తామే పూర్తి కాలం అధికారంలో ఉంటామన్నారు.

కేంద్రం ఏమైనా జమిలి ఎన్నికల ఆలోచన వస్తే మాత్రం.. ఆ విధంగా ఎన్నికలు జరుగుతాయని.. లేనిపక్షంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగటం ఖాయమన్నారు. చంద్రబాబు పగటి కలలు కంటారన్న మిథున్ రెడ్డి.. ఈ మధ్యన తంబళ్ల పల్లి ఎమ్మెల్యేపైనా.. తన మీదా వైసీపీకి చెందిన కొండ్రేడ్డి అనే నేత చేసిన ఆరోపణలపై స్పందించారు.

సదరు వైసీపీ నేతపై పలు కేసులు ఉన్నాయని.. బస్సు దోపిడీ లాంటి కేసులు కూడా నమోదైనట్లుగా మిథున్ రెడ్డి పేర్కొన్నారు. మరి.. అంతటి నేర చరిత్ర ఉన్న నేతను ఇంకా పార్టీలో ఎందుకు కొనసాగిస్తున్నట్లు? వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చు కదా? అని ప్రశ్నలకు మిథున్ రెడ్డి ఏమని బదులిస్తారు. ఈ విషయాన్ని ఇలా ఉంచితే.. ముందస్తు ఎన్నికల మీద మాత్రం ఆయన పూర్తి స్పష్టతను ఇచ్చారని చెప్పక తప్పదు.