Begin typing your search above and press return to search.

లోక్ సభలో మిథున్ రెడ్డి మొదటి వరుసలో.. రాహుల్ రెండో వరుసలో

By:  Tupaki Desk   |   3 Aug 2019 4:39 AM GMT
లోక్ సభలో మిథున్ రెడ్డి మొదటి వరుసలో.. రాహుల్ రెండో వరుసలో
X
లోక్ సభలో పార్టీల బలాల ఆధారంగా సీట్ల కేటాయింపు సంగతి తెలిసిందే. తాజాగా లోక్ సభకు ఎన్నికైనా పార్టీ సభ్యులకు కేటాయించే సీట్ల మీద కసరత్తు జరిగి.. ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలన్న అంశంపై చర్చ జరిగింది. మోడీ 2.0 సర్కారులో ఎవరి ప్రాధాన్యత ఎంతన్న విషయాన్ని తాజాగా కేటాయించిన సీట్లతో చెప్పేయొచ్చు.

ప్రధాని నరేంద్ర మోడీతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చర్చించి మరీ ఏ వరుసలో ఎవరు కూర్చోవాలన్న విషయాన్ని డిసైడ్ చేసినట్లుగా చెబుతున్నారు. తాజాగా నిర్ణయించిన ప్రకారం లోక్ సభలోని తొలివరుసలో ప్రధాని మోడీతో పాటు.. కేంద్రమంత్రులు అమిత్ షా.. రాజ్ నాథ్ సింగ్.. నితిన్ గడ్కరీ.. నరేంద్ర సిగ్ తోమర్.. సదానంద గౌడ్.. రవిశంకర్ ప్రసాద్.. అర్జున్ ముండా.. రమేశ్ పోఖ్రియాల్.. అరవింద్ సావంత్.. స్మృతీ ఇరానీ, జేడీయూ నేత రాజీవ్‌ రంజన్‌ సింగ్‌కు ముందు వరుసలో సీట్లు కేటాయించారు. అంతేకాదు.. ఏపీ అధికారపక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి ప్రతిపక్షం స్థానంలో తొలి వరుసలో సీటు కేటాయించారు.

కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. సోనియాగాంధీతో పాటు ఆ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరిలకు మాత్రమే తొలి వరుసలో కూర్చునే అవకాశం దక్కింది. రాహుల్ గాంధీకి సైతం రెండో వరుసలో చివరి సీటు లభించటం గమనార్హం. తృణమూల్‌ సీనియర్‌ నేత సుదీప్ బందోపాధ్యాయ పక్కనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మిథున్ రెడ్డికి ముందువరుసలో సీట్ కేటాయించారు. ఇక.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలకు నాలుగు.. ఐదు.. ఆరు వరుసలో ఒకరి వెనుక మరొకరికి స్థానాలు ఏర్పాటు చేశారు. ఇక.. తెలంగాణ అధికారపక్షం టీఆర్ఎస్ కు చెందిన ఎంపీలకు మూడో వరుసలో కూర్చునేలా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.