Begin typing your search above and press return to search.

ఎంపీ అంటే నో ...వైసీపీ టీడీపీ సేం టూ సేం

By:  Tupaki Desk   |   28 Jan 2023 9:52 AM GMT
ఎంపీ అంటే నో ...వైసీపీ టీడీపీ సేం టూ సేం
X
ఎంపీ పదవి చాలా కీలకమైనది. దర్జాతో కూడుకున్నది. పార్లమెంట్ మెంబర్ అనిపించుకోవడం అంటే హోదా వేరొకటి లేదు. ఉత్తరాంధ్రాలో తీసుకుంటే అయిదు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. వీటిలో నాలుగింటిని వైసీపీ 2019 ఎన్నికల్లో గెలిచింది. శ్రీకాకుళం ఎంపీ సీటుని మాత్రం రెండవమారు కూడా గెలిచి కింజరాపు వారి వారసుడు రామ్మోహన్ నాయుడు నిలబెట్టుకున్నారు. ఇక 2024 ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అయితే ఉత్తరాంధ్రాలో ప్రస్తుతం ఉన్న ఎంపీలలో తిరిగి మళ్లీ పోటీ చేసే వారు అయితే లేరు అనే అంటున్నారు.

వైసీపీ విషయమే తీసుకుంటే కొందరిని మార్చేద్దామని చూస్తోంది. మరి కొందరిని కంటిన్యూ చేద్దామన్నా వారే వద్దు అని తప్పుకునేలా ఉన్నారట. ఆ జాబితాలో మొదట విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గురించి చెప్పాలి. ఆయన 2019లోనే స్వల్ప ఆధిక్యతతో గెలిచారు. అది కూడా జనసేన మధ్యన ఉండబట్టి. లేకపోతే అద్భుతమైన మెజారిటీతో తెలుగుదేశం గెలిచేది.

ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వేవ్ ఎటూ ఉండదు, ఎదురొడ్డి గెలవాలంటే సొంత ఇమేజ్ ఉండాలి. పైగా బాగా ఖర్చు పెట్టాలి. దాంతో నాకు ఒక అసెంబ్లీ సీటు ఇస్తే చాలు అని ఆయన అంటున్నారు. ఇక అనకాపల్లి ఎంపీ సత్యవతి విషయం కూడా అలాగే ఉంది.ఆమె కూడా పోటీకి నో చెప్పేస్తున్నారు. ఇస్తే గిస్తే అసెంబ్లీ ఇవ్వండి అంటున్నారు. అదీ లేకపోతే ఆమె రాజకీయలకు గుడ్ బై అంటున్నారు.

ఇక అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని తీసుకుంటే ఆమె కూడా ఢిల్లీకి వెళ్లడానికి ససేమిరా అంటున్నట్లుగా భోగట్టా. రెండున్నర లక్షల ఓట్ల మెజారిటీతో ఆమె గెలిచారు. మరోసారి ఆమెకే టికెట్ ఇవ్వాలని అధినాయకత్వం భావిస్తున్నా అసెంబ్లీకి పోటీ చేస్తాను అని ఆమె చెబుతున్నారట. ఇస్తే పాడేరు కానీ లేకపోతే అరకు కానీ ఇవ్వాలని ఆమె అంటున్నట్లు చెబుతున్నారు.

విజయనగరంలో చూస్తే బెల్లాన చంద్రశేఖర్ ఎంపీగా ఉన్నారు. ఆయన ఈసారి అసెంబ్లీ వైపే చూస్తున్నారు. ఆయన ఎచ్చెర్ల నియోజకవర్గం మీద కన్నేశారని అంటున్నారు. ఒకవేళ బొత్స వదిలేస్తే చీపురుపల్లి నుంచి పోటీకి తయారు అంటున్నారు. వైసీపీలో ఇలా పరిస్థితి ఉంటే తెలుగుదేశం నుంచి ఎంపీ అయిన రామ్మోహన్ కూడా ఎంపీ వద్దు అసెంబ్లీకే ఈసారి పోటీ చేస్తాను అని చంద్రబాబు వద్దనే విన్నపం చేసుకున్నారని టాక్ నడుస్తోంది. ఆయన నరసన్నపేట సీటుని కూడా సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు.

దాంతో అటు జగన్ ఇటు చంద్రబాబులకు ఎంపీ సీట్లు అతి పెద్ద పరీక్ష కాబోతున్నాయని అంటున్నారు. ఎవరిని అడిగినా ఎంపీ ఎందుకు అసెంబ్లీకే అంటున్నారు. పూసపాటి అశోక్ గజపతిరాజు విజయనగరం ఎంపీగా మరోసారి పోటీకి విముఖంగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే అయి పార్టీ గెలిస్తే మంత్రి కావాలని చూస్తున్నారు. అదే విధంగా వైసీపీ ఎంపీలూ ఉన్నారు.

ఇక్కడ మరో విషయం కూడా ఉంది అంటున్నారు. ఈసారి వైసీపీ అయినా టీడీపీ అయినా ఎంపీ అభ్యర్ధిగా ఉన్న వారు తమ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్ధులకు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఢీ అంటే ఢీ అనే 2024 ఎన్నికల్లో ఈ ఖర్చు తడిసి మోపెడు అవుతుందని, ఇంత భారం తమకు ఎందుకు హాయిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే పోలా అని ఆశావహులు కూడా ఆలోచిస్తున్నారుట. మరి ఎంపీ సీటుకు పోటే పడే బిగ్ షాట్స్ ఎవరు అన్నదే వైసీపీ టీడీపీ చేసే సెర్చింగ్ అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.