Begin typing your search above and press return to search.

ఈసారి బతుకమ్మ ఆడను.. కవిత వివరణ..

By:  Tupaki Desk   |   6 Oct 2018 8:38 AM GMT
ఈసారి బతుకమ్మ ఆడను.. కవిత వివరణ..
X
బతుకమ్మ.. తెలంగాణలోనే పెద్ద పండుగ.. దసరా ముందు వచ్చే ఈ పండుగను తెలంగాణ మహిళలు - పురుషులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో పట్టని ఈ అచ్చ తెలంగాణ పండుగను తెలంగాణ జాగృతి ప్రపంచవ్యాప్తం చేసింది. ఉద్యమకాలంలో కేసీఆర్ కూతురు కవిత తన జాగృతి ద్వారా దేశ విదేశాల్లో - తెలంగాణలో బతుకమ్మ పండుగకు విశేష ప్రాచుర్యం కల్పించింది. తెలంగాణ రాష్ట్ర సమితికి అనుబంధంగా ఉన్న జాగృతి ఈసారి మాత్రం బతుకమ్మ పండుగ వేళ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎంపీ కవిత ఈసారి తాను - తన జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనని.. నిర్వహించనని స్పష్టం చేసింది..

ఎంపీ కవిత మాట్లాడుతూ ‘ఈసారి తెలంగాణలో జరిగే బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం లేదు. తన జాగృతి సంస్థ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రావడంతో టీఆర్ ఎస్ శ్రేణులంతా ఎన్నికల మీదే దృష్టిసారించారు. అందుకే తాను కూడా ఎన్నికలుండడంతో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం లేదు. తెలంగాణలో మహిళలందరూ ఈ వేడుకను అంగరంగ వైభవంగా ఈసారి కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని’ ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే కవిత.. ఈసారి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనకపోవడానికి కేసీఆరే కారణమని వార్తలొస్తున్నాయి. బతుకమ్మ పేరుతో కవిత రాజకీయ మైలేజ్ పొందాలని చూస్తోందని... ఇటీవల ప్రతిపక్షాలు విమర్శించాయి. దీంతో కేసీఆర్ సూచన మేరకు వైరి పక్షాలకు ఎటువంటి విమర్శలకు తావివ్వకుండా ఈ వేడుకల్లో పాల్గొనవద్దని కవిత నిర్ణయించుకున్నారట..

‘గడిచిన నాలుగేళ్లుగా తెలంగాణలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తే డబ్బులన్నీ కూతురికే కేసీఆర్ ఇస్తున్నాడని ప్రతిపక్ష నాయకులు విమర్శించారు.. ఈ ఎన్నికల వేళ ఇదో రాద్ధాంతం కావడానికి ఇష్టం లేదు.. అందుకే ఈసారి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం లేదు’ అంటూ కవిత క్లారిటీ ఇచ్చింది. బతుకమ్మ వేడుకల కోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి తాము ఒక్క రూపాయి కూడా గడిచిన నాలుగేళ్లలో పొందలేదని కవిత వివరణ ఇచ్చారు.