Begin typing your search above and press return to search.

జానారెడ్డికి గ‌ట్టి స‌వాల్ విసిరిన ఎంపీ క‌విత‌

By:  Tupaki Desk   |   3 Aug 2017 2:30 PM GMT
జానారెడ్డికి గ‌ట్టి స‌వాల్ విసిరిన ఎంపీ క‌విత‌
X
తెలంగాణ‌లో అధికార‌-ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజాగా నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. సీఎం విమర్శ‌ల నేప‌థ్యంలో సీఎల్పీ నేత‌, కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి అదే రీతిలో స్పందించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కోర్టు కేసుల విషయంలో కాంగ్రెస్ ను విమర్శిస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు విమర్శలు స‌రికాద‌న్నారు. ప్ర‌భుత్వ‌మే ఉద్దేశ‌పూర్వ‌కంగా క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ విష‌యంలో రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్న‌ద‌ని మండిప‌డ్డారు. అయితే దీనిపై ఎంపీ క‌విత స్పందిస్తూ ఏకంగా ఓపెన్ చాలెంజ్ విసిరారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాడుతున్న భాషను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి అన్నారు. విపక్షంగా తాము సంయమనంతో వ్యవహరిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ చర్యలతో, వైఖరితో కడుపు మండిన వాళ్లే కోర్టును ఆశ్రయిస్తున్నారని జానారెడ్డి చెప్పారు. తెరాస సర్కార్ ను ప్రజలు తిరస్కరించే రోజు త్వరలోనే ఉందని జానారెడ్డి అన్నారు. అభివృద్ధికి కాంగ్రెస్ అడ్డుపడుతోందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. బాధ్యతాయుత‌ విపక్షంగా రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ తోడ్పడుతోందని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిన వారిలో గతంలో తెలంగాణ జాగృతిలో పని చేసిన వారు కూడా ఉన్నారని చెప్పారు.

జానారెడ్డి విలేక‌రు స‌మావేశం నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య‌, ఎంపీ క‌విత స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నేత‌ జానారెడ్డి ఆరోపించినట్లు కేసు వేసిన వ్య‌క్తి సతీష్ త‌న సార‌థ్యంలోని తెలంగాణ జాగృతి సభ్యుడు కాదని తెలిపారు. సతీష్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శంకర్ ముదిరాజ్ కి అత్యంత సన్నిహితుడని అన్నారు. కేసు వేసిన వ్య‌క్తి పేరు స‌హా అడ్ర‌స్ ఇస్తున్నామ‌ని జానారెడ్డి గారు ఆరోపణలు నిరూపించాల‌ని ఎంపీ క‌విత‌ స‌వాల్ విసిరారు. సింగరేణి కారుణ్య నియామకాలను అడ్డుకుంటుంది కాంగ్రెస్ పార్టీయేన‌ని అన్నారు. టీఆర్ఎస్ ఎప్పుడూ కార్మికుల పక్షమేన‌ని ఎంపీ క‌విత తేల్చిచెప్పారు. ఢిల్లీలో ఎంపీ క‌విత మీడియాతో మాట్లాడుతూ త‌మ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌లువురు మంత్రుల‌ను క‌లిసిన‌ట్లు వివ‌రించారు. నిజామాబాద్ నియోజక వర్గానికి విద్యుత్ శాఖ నుంచి రూ. 314 కోట్లు రావాల్సి ఉందని, ఈ అంశంపై మంత్రి పియూష్ గోయల్ తో చర్చించాన‌ని ఎంపీ క‌విత తెలిపారు. జగిత్యాలకు ఏకలవ్య పాఠశాలను కేటాయించాలని గిరిజన శాఖ మంత్రి జువెల్ ఓరాంని కలిశాన‌ని వివ‌రించారు. నిజామాబాద్ నియోజక వర్గంలో 100 ఎకరాలలో నిర్మించనున్న పార్క్ కు ఆర్థిక సాయం అందించే అంశంపై ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ మంత్రి నరేంద్ర సింగ్ థోమర్ ని కలిశామ‌ని ఎంపీ క‌విత వివ‌రించారు. త‌మ‌ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని తెలిపారు. రేపు గల్ఫ్ బాధితుల సమస్యలపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తో భేటి కానున్నామ‌ని ఎంపీ క‌విత తెలిపారు.