Begin typing your search above and press return to search.

కేకే అన్నేసి గంటలు ప్రగతి భవన్ లో ఏం చేస్తున్నట్లు?

By:  Tupaki Desk   |   18 Oct 2019 4:44 AM GMT
కేకే అన్నేసి గంటలు ప్రగతి భవన్ లో  ఏం చేస్తున్నట్లు?
X
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎవరూ మాట్లాడకుండా గమ్మున ఉండిపోవటం తెలిసిందే. అంతర్గత సంభాషణల్లో సమ్మెకు తమ మద్దతు ఉంటుందన్నా.. ఆ విషయాన్ని బయటకు వెల్లడించేందుకు ఏ మాత్రం ఇష్టపడటం లేదు సరికదా.. వీలైనంతవరకూ అలాంటివేమీ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటివేళ.. రాజ్యసభ సభ్యుడు.. టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న కె. కేశవరావు మాత్రం భిన్నమైన స్వరాన్ని వినిపించారు.

ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావాలన్నారు. దీంతో.. సమ్మె పరిష్కార దిశగా అడుగులు పడుతున్నట్లుగా భావించారు. ఉద్యోగ సంఘాల నేతలూ తాము చర్చలకు సిద్ధమన్నారు.అంతలోనే.. ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి ఆదేశాలు రాలేదంటూ కేకే మౌనం వహించారు. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోసం తాను ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కేకే వ్యాఖ్యలు సంచలనంగా మారటమే కాదు.. ఆయన మాటలపై పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.

తిరుగుబాటుకు కేకే సిద్ధమయ్యారని కొందరు రాస్తే.. పార్టీ రాజ్యసభ సభ్యులంతా కలిసి బీజేపీలో విలీనం చేసే అవకాశం ఉందంటూ రకరకాలుగా రాశారు. దీంతో.. కేకే ఇరుకున పడే పరిస్థితి. మీడియా.. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారంతో కేకే మీద ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

కేకే లాంటి నేత ముఖ్యమంత్రిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరితే రాకపోవటమా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తాయి. నచ్చిన వారికి నిమిషాల్లో అపాయింట్ మెంట్ ఇచ్చే కేసీఆర్.. నచ్చని వారి విషయంలో ఆయన కలిసేందుకు సైతం ఒప్పుకోకపోవటం తెలిసిందే. కేకే విషయంలోనూ అలానే జరిగిందన్న మాట వినిపించింది. ఇలాంటివేళ.. గురువారం ఆయనకు ప్రగతిభవన్ నుంచి పిలుపు వచ్చింది.

ప్రగతిభవన్ కు వెళ్లిన కేకే.. గంటల తరబడి అక్కడే ఉండిపోవటం ఆసక్తికరంగా మారింది. హుజూర్ నగర్ సభకు తనతో పాటు కేకేను కూడా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి భావించారని.. వర్షం కారణంగా సభ రద్దు కావటంతో ప్రగతిభవన్ లోనే ఉండిపోయారు. అయితే.. ప్రగతిభవన్ లో కేసీఆర్ కోసం వెయిట్ చేసేందుకే కేకే ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి వచ్చిందన్న మాట వినిపిస్తోంది. తన ఇంటికి వచ్చిన వారు ఎవరైనా సరే.. భోజన వేళలో వారితో కలిసి భోజనం చేసే అలవాటున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. కేకేతో లంచ్ చేశారు.

గంటల తరబడి ప్రగతిభవన్ లో ఉంచేయటం ద్వారా తనకున్న గుర్రు ఏ పాటితో చేతలో చూపించారన్న మాట బలంగా వినిపిస్తోంది. దీనికి బలం చేకూరేలా మీడియా రిపోర్టులు కూడా.. ఇద్దరు నేతల భేటీలో ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశం చర్చకు రాలేదని రావటం గమనార్హం. బయట ఇంత హాట్ టాపిక్ నడుస్తున్న వేళ.. మాట్లాడకుండా ఉండే అవకాశం ఉంటుందా చెప్పండి?