Begin typing your search above and press return to search.

అల‌కే కాదు..రాజీనామాకూ జేసీ రెఢీనా?

By:  Tupaki Desk   |   19 July 2018 11:32 AM GMT
అల‌కే కాదు..రాజీనామాకూ జేసీ రెఢీనా?
X
గ‌డిచిన రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన జేసీ వ్య‌వ‌హారం మ‌రో మ‌లుపు తిరిగింది. మోడీపై అవిశ్వాస తీర్మానాన్ని టీడీపీ పెట్ట‌టం.. దానికి లోక్ స‌భ స్పీక‌ర్ ఓకే చేసి.. తీర్మానంపై చ‌ర్చ‌కు శుక్ర‌వారం ముహుర్తంగా పెట్ట‌టం తెలిసిందే. అయితే.. ఈ వ్య‌వ‌హారంలో త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల్సిందిగా బాబు అన్ని పార్టీలకు లేఖ‌లు రాస్తుంటే.. అదే పార్టీకి చెందిన ఎంపీ జేసీ మాత్రం ఢిల్లీకి వెళ్ల‌కుండా అనంత‌పురానికి వెళ్ల‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. తాను ఢిల్లీ వెళ్లాల్సిన అవ‌స‌రం లేదంటూనే.. తాను వెళితే మాత్రం లాభ‌మేంద‌న్న మాట‌ను మాట్లాడుతున్న జేసీ.. తాను ఎందుకు వెళ్ల‌లేదో చంద్ర‌బాబుకు తెల‌సంటూ మ‌రింత ఉత్సుక‌త‌ను పెంచే ప్ర‌య‌త్నం చేశారు. ఏమ‌నుకున్నారో ఏమో కానీ తాజాగా తానెందుకు అల‌క‌పాన్పు ఎక్కిందో చెప్పేశారు.

త‌న‌ను బాబు అస్స‌లు ప‌ట్టించుకోవ‌టం లేద‌ని.. అనంత‌పురం ఫ్లైఓవ‌ర్ కోసం నిధులు అడిగితే ప్ర‌భుత్వం నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి స్పంద‌న లేద‌న్న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. పార్టీలో త‌న‌కు ప్రాధాన్య‌త త‌గ్గింద‌న్న ఆయ‌న‌.. త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర ఆవేద‌న వ్య‌క్తంచేసిన‌ట్లుగా చెబుతున్నారు. తాను పార్టీలోకి తీసుకొచ్చిన గుర్నాధ్ రెడ్డిని కానీ.. మ‌ధుసూద‌న్ గుప్తాను సైతం ప‌ట్టించుకోవ‌టం లేద‌ని.. వారికి ప్రాధాన్య‌త ద‌క్క‌టం లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. త‌న‌ను ప‌ట్టించుకోని అధినేత‌కు త‌న ప్రాధాన్య‌త తెలిసేలా చేసేందుకే టైం చూసుకొని మ‌రీ జేసీ అల‌క‌పాన్పు ఎక్కిన‌ట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. త‌న డిమాండ్ల విష‌యంలో చంద్ర‌బాబు కానీ పాజిటివ్ గా రియాక్ట్ కాని ప‌క్షంలో ఎంపీ ప‌ద‌వికి తాను రాజీనామాను చేస్తాన‌ని త‌న స‌న్నిహితుల‌తో జేసీ చెప్పిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, ఆ వార్త‌ల‌పై జేసీ ఏవిధంగా స్పందిస్తారో అన్న విష‌యం కూడా ఆస‌క్తికరంగా మారింది. మ‌రోవైపు, ఇప్ప‌టికే ఢిల్లీకి వెళ్ల‌కుండా త‌న తీరుతో బాబుకు బీపీ తెప్పిస్తున్న జేసీ.. తాజాగా త‌న అల‌క వ్యాఖ్య‌ల‌తో అధినేత‌కు మ‌రింత మంట పుట్టేలా చేస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి.. జేసీ అల‌క‌ను బాబు తీరుస్తారా. లేదంటే.. తెగే వ‌ర‌కూ ఇష్యూను లాగుతారా? చూడాలి.