Begin typing your search above and press return to search.

కలియుగ శిశుపాలుడు కొడాలి నాని:జీవీఎల్

By:  Tupaki Desk   |   24 Sept 2020 7:00 PM IST
కలియుగ శిశుపాలుడు కొడాలి నాని:జీవీఎల్
X
తిరుమలలో అన్యమతస్థుల డిక్లరేషన్ వ్యవహారం ఏపీతోపాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ డిక్లరేషన్ వ్యవహారంపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. నాని వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ ను సతీసమేతంగా డిక్లరేషన్ కోరిన బీజేపీ...ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి లను కూడా అడగాలంటూ నాని చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తప్పించాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నానిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. కొడాలి నాని కలియుగ శిశుపాలుడు అంటూ జీవీఎల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కొడాలి నాని అహంకారంతో హిందూ దేవుళ్లను దూషిస్తున్నారని, ఆయన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనసులను గాయపరిచేలా ఉన్నాయని జీవీఎల్ దుయ్యబట్టారు. అత్యంత పవిత్ర హిందువులైన ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగిని కూడా నాని దూషించారని, నానిని మంత్రివర్గం నుంచి వెంటనే తొలగించాలని అన్నారు. ప్రధాని మోదీని నాని 100 సార్లు దూషించేదాకా వేచి చూస్తారో....లేక చంద్రబాబులా తమ పతనాన్ని కోరి తెచ్చుకుంటారో అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి జీవీఎల్ వ్యాఖ్యానించారు. తమ తప్పును గుర్తించి కొడాలి నానిని వెంటనే తొలగిస్తారో చూడాల్సి ఉందంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జీవీఎల్ తోపాటు పలువురు బీజేపీ నేతలు...నానిని మంత్రి పదవి నుంచి తొలగించాలని, చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేస్తున్నారు. మరోవైపు, కేంద్రంలో ఎన్డీఏతో సఖ్యతగా ఉంటున్న వైసీపీ...డిక్లరేషన్, ఆలయాలపై దాడులు, నాని వ్యాఖ్యలు వంటి వ్యవహారాల నేపథ్యంలో ఎలా స్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది.