Begin typing your search above and press return to search.

పంజాబ్ లోనూ ట్యాపింగ్ రగడ

By:  Tupaki Desk   |   8 Sep 2015 9:45 AM GMT
పంజాబ్ లోనూ ట్యాపింగ్ రగడ
X
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఫోన్ ట్యాపింగు వ్యవహారం కొద్దికాలంగా ఎంత రగడ సృష్టిస్తోందో తెలిసిందే.. టీడీపీ, తెరాస పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తెచ్చింది. ఇప్పుడు పంజాబ్ లోనూ అలాంటి పరిస్థితే ఏర్పడింది. అక్కడ బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ఇప్పుడు వివాదం నడుస్తోంది.

పంజాబ్‌ లో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు భగవంత్‌ మన్, ధరంవీర్ గాంధీ టెలిఫోన్ సంభాషణలు లీక్ కావడంతో కేంద్ర ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడుతోంది. తమ ఎంపీల ఫోన్ లను బిజెపి ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ఆరోపించింది. ఇందుకు భగవంత్‌ మన్, ధరంవీర్ సంభాషణల టేప్ బహిర్గతం కావడమే ఉదాహరణ అని పేర్కొంది. ఫోన్ల ట్యాపింగ్ అంశంపై కేంద్రానికి వ్యతిరేకంగా లోక్‌సభ స్పీకర్‌ కు లేఖ రాయాలని ఆప్ నిర్ణయించింది. ఇతర పార్టీల ఎంపీలను తమ వైపుకు తిప్పుకునేందుకు బిజెపి ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడలివని విమర్శించారు. దీనిపై విచారణ జరిపించాలని ఆప్ డిమాండ్ చేస్తోంది.

కాగా, సామాజిక మీడియాలో వీరి సంభాషణల టేప్ హల్‌ చల్ చేస్తోంది. ఇందులో ధరంవీర్‌ తో భగవంత్‌ మన్ మాట్లాడుతూ ఆప్ నాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. చీపురు గుర్తు వల్ల తాను గెలవలేదని, ప్రజల్లో తనకు ఉన్న గుర్తింపు వల్లనే గెలిచానని భగవంత్‌ మన్ అన్నారు. ఢిల్లీలో లాగా ఇక్కడి ప్రజలు గుర్తును చూసి ఓటేయలేదని, అభ్యర్థులను చూసి ఓట్లేశారని గాంధీతో వ్యాఖ్యానిస్తూ పార్టీపై తన అసంతృప్తిని మన్ వ్యక్తం చేశారు. వీరిద్దరి ఈ సంభాషణ ఫిబ్రవరిలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందురోజుదని చెబుతున్నారు. ఈలెక్కన ఆ ఇద్దరు ఎంపీలు ఎగిరిపోయే పక్షులేనని అర్తమవుతోంది. ఈ సంగతి ఎలా ఉన్నా ట్యాపింగ్ చేశారన్న అంశంపై మాత్రం ఇప్పుడు బీజేపీ, ఆప్ లు మాటలు రువ్వుకుంటున్నాయి. మరి తెలుగు రాష్ట్రాల మాదిరిగా కేసులు పెట్టుకుంటారో లేదో చూడాలి.