Begin typing your search above and press return to search.

గురువును సలహాలు ఇవ్వమంటున్న శిష్యుడు

By:  Tupaki Desk   |   9 Jun 2016 7:25 AM GMT
గురువును సలహాలు ఇవ్వమంటున్న శిష్యుడు
X
కాలం చాలా చిత్రమైంది. ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితి. రెండున్నరేళ్ల క్రితం వరకూ సాదాసీదాగా ఉంటూ.. ఏ గురువారి సూచనలు.. సలహాల కోసం తపించే వారో.. ఇప్పుడు అదే గురువు పైనే తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న తీరు చూస్తే కాల వైచిత్రి అనే చెప్పాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమానికి కేంద్రంగా మారి.. ఒంటిచేత్తో ఉద్యమ రథాన్ని నడిపిన తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాంకు ఉన్న అనేక మంది శిష్యుల్లో బాల్క సుమన్ ఒకరు. ఉస్మానియా వర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఉన్న ఆయన.. తమ మాష్టారైన కోదండరాంకు చాలా సన్నిహితంగా ఉండేవారు.

తెలంగాణ రాష్ట్ర రావటం.. టీఆర్ ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగటం.. కాంగ్రెస్ నేత వివేక్ మీద పోటీ చేసిన ఆయన అనూహ్యంగా విజయం సాధించి ఎంపీ కావటం తెలిసిందే. తాజాగా తెలంగాణ రాష్ట్ర అధికారపక్షంపై ప్రొఫెసర్ కోదండరాం విమర్శలు చేసిన నేపథ్యంలో.. టీఆర్ ఎస్ నేతలు పలువురు తీవ్ర విమర్శలు చేశారు. అలా విమర్శలు చేసిన వారిలో బాల్క సుమన్ ఒకరు. ఉద్యమ సమయంలో ఏ గురువును అయితే వినయవిధేయలతో ఫాలో అయ్యారో.. ఇప్పుడు అదే గురువును ఎంపీ హోదాలో ఆయన చెలరేగిపోతున్నారు. అందరూ మెచ్చుకుంటుంటే.. మీరు మాత్రం విమర్శలు చేయటం ఏ మాత్రం బాగోలేదంటున్న బాల్క సుమన్.. సుపరిపాలన కోసం కోదండరాం ఎన్ని సలహాలు ఇచ్చినా స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు.

తెలంగాణ ప్రయోజనాలు దెబ్బ తీసేలా ఏపీ సర్కారు వ్యవహరించినప్పుడు కోదండరాం మౌనంగా ఉన్నారంటూ ఆరోపించిన బాల్క సుమన్.. కోదండరాంకు మద్దుతుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రేవంత్ రెడ్డిలు ఎందుకు మాట్లాడుతున్నారో తెలియాలంటూ తన మనసులోని సందేహాన్ని తెర పైకి తీసుకొచ్చారు. ఒకరిపై విమర్శలు చేస్తే.. వారు మాత్రమే స్పందించాలన్న రూల్ లేదు కదా? కానీ.. ఇలాంటి చిత్రమైన సందేమాలు బాల్క సుమన్ ఎందుకు వస్తున్నట్లు? గురువు కోదండరాంనే సలహాలు ఇవ్వమని సూచనలు చేస్తున్న సుమన్ రానున్న రోజుల్లో మరెంత చెలరేగిపోతారో..?