Begin typing your search above and press return to search.

వైఎస్‌ వివేకా మర్డర్‌.. ఎంపీ అవినాశ్‌ తండ్రి రిమాండ్‌ పొడిగింపు!

By:  Tupaki Desk   |   29 April 2023 3:18 PM GMT
వైఎస్‌ వివేకా మర్డర్‌.. ఎంపీ అవినాశ్‌ తండ్రి రిమాండ్‌ పొడిగింపు!
X
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి రిమాండ్‌ ను సీబీఐ న్యాయస్థానం పొడిగించింది.. గడువు ముగియడంతో ప్రస్తుతం చంచల్‌ గూడలో ఉన్న వైఎస్‌ భాస్కర్‌ రెడ్డిని పోలీసులు సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయస్థానం భాస్కర్‌ రెడ్డి రిమాండ్‌ను మే 10వ తేదీ వరకు పొడిగించింది. దీంతో విచారణ అనంతరం భాస్కర్‌ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

కాగా వివేకాను హత్య చేయడం, సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం విస్తృత కుట్రలో భాగమేనని సీబీఐ తన రిమాండ్‌ రిపోర్టులో ఇటీవల సుప్రీంకోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనివల్ల లబ్ధి పొందింది.. అవినాష్‌ రెడ్డేనని సీబీఐ పేర్కొంది. ఈయన అనుచరులు ఎర్ర గంగిరెడ్డి, యాదాటి సునీల్‌ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌ రెడ్డి, షేక్‌ దస్తగిరి వివేకాను హత్య చేశారని పేర్కొంది.

హత్య తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేయడం వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిల సమక్షంలో, వారి ఆదేశాల మేరకే జరిగిందని సీబీఐ ఆరోపించింది. అందువల్ల ఈ హత్య వెనుక వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి ఉన్నారన్న ఆరోపణలు పూర్తి నిరాధారమని రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించింది.

2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు వెన్నుపోటు పొడిచారని వివేకానందరెడ్డి .. కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కక్ష గట్టి వివేకా హత్యకు భాస్కరరెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి, ఇతరులు కుట్ర పన్నార ని సీబీఐ ఆరోపించింది. ఈ క్రమంలో హత్యకు నెల రోజుల ముందే నిందితులకు రూ.40 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారని వెల్లడించింది. సునీల్‌ యాదవ్‌ ద్వారా షేక్‌ దస్తగిరికి ముందస్తుగా రూ.కోటి ముట్టజెప్పారని రిమాండ్‌ రిపోర్టులో సీబీఐ పేర్కొంది.

కాగా మరోవైపు కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి అరెస్టు కాకుండా ముందస్తు ఆదేశాలు ఇవ్వలేదని తెలంగాణ హైకోర్టు తాజాగా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ ను తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ముగిశాక జూన్‌ మొదటి వారంలో విచారిస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సీబీఐ అవినాశ్‌ ను అరెస్టు చేయాలనుకుంటే చేయొచ్చు. ఆయనను అరెస్టు చేయద్దని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తప్పుబట్టిన సంగతి తెలిసిందే.