Begin typing your search above and press return to search.

మోడీ తీరుపై సీమాంధ్ర ఎంపీ తొలి శపథం

By:  Tupaki Desk   |   9 Sep 2016 5:13 AM GMT
మోడీ తీరుపై సీమాంధ్ర ఎంపీ తొలి శపథం
X
వ్యాపారాలే కాదు.. కాస్త ప్రజా సమస్యల్ని కూడా పట్టించుకోండి అంటూ తనదైన శైలిలో ఏపీ ఎంపీలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడటం మర్చిపోలేం. తిరుపతి సభలో ఏపీ ఎంపీలపై ఆయన నిప్పులే చెరిగారు. నాడు కాంగ్రెస్ ఎంపీలు.. నేటి ఏపీ అధికారపక్ష ఎంపీల తీరు ఒకేలా ఉందని.. నాడు మేడమ్.. మేడమ్ అంటే.. నేడు.. సార్.. సార్ అంటున్నారని.. పిలుపు మాత్రమే మారింది తప్పించి మిగిలినవేవీ మారలేదంటూ ఫైర్ కావటం తెలిసిందే. మరికొద్ది గంటల్లో కాకినాడలో పవన్ కల్యాణ్ ‘సీమాంధ్ర ఆత్మగౌరవ సదస్సు’ జరగనుంది.

ఈ సభకు భారీ ఎత్తున జనాలు వెల్లువెత్తే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సభలో ఎవరిని ఎన్ని మాటలైనా అనొచ్చు కానీ.. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ను మాత్రం పవన్ కల్యాణ్ తిట్టే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది. తాజాగా అవంతి నోటి నుంచి వచ్చిన శపధమే అలా చేస్తుందని చెబుతున్నారు. విశాఖపట్టణం కేంద్రంగా రైల్వే జోన్ ఇచ్చే వరకూ పార్లమెంటులో తాను అడుగుపెట్టనంటూ అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ భీకర శపధం చేశారు. తనకు విశాఖ జోన్ కంటే తన ఎంపీ పదవి ఏ మాత్రం ముఖ్యం కాదని తేల్చేశారు.

విశాఖకు రైల్వే జోన్ ప్రకటనకు సంబంధించి కేంద్ర వైఖరిని నిరసించిన ఆయన.. తన ఒక రోజు నిరాహారదీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా విశాఖకు జోన్ అన్నది ఉత్తరాంధ్రప్రజలు హక్కుగా అభివర్ణించిన ఆయన.. ఈ డిమాండ్ గడిచిన 40 ఏళ్ల కలగా ఆయన పేర్కొన్నారు. రైల్వే జోన్ ను విశాఖ కేంద్రంగా ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చిందన్న అవంతి మాటలే కాదు.. ఆయన చేతలుకూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఏపీ ప్రయోజనాల మీద శపధం లాంటి వాటిని ప్రకటించిన మొట్టమొదటి ప్రజా ప్రతినిధిగా అవంతి శ్రీనివాస్ గుర్తుండి పోవటం ఖాయం. ఈ నేపథ్యంలో అవంతిపై పవన్ సటైర్లు ఉండవనే మాట వినిపిస్తోంది.