Begin typing your search above and press return to search.

పరామర్శలోనూ ఇదెక్కిడి న్యాయం అసద్?

By:  Tupaki Desk   |   22 Aug 2020 5:30 PM GMT
పరామర్శలోనూ ఇదెక్కిడి న్యాయం అసద్?
X
రాజ్యాంగం.. లౌకికతత్త్వం.. ఇలాంటి పెద్ద పెద్ద మాటలు చెబుతూ.. సుద్దులు వల్లించే మజ్లిస్ అధినేత అసుద్దీన్ ఓవైసీ ఎలా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ ఎంపీ స్థానానికి తిరుగులేని నేతగా ఆయనకున్న ప్రత్యేక పవర్ గురించి తెలంగాణలో అందరికి తెలుసు. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు ఇలా ఉండాలి? అలా ఉండాలని చెప్పే ఆయన.. తాను మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు.

అసద్ పరామర్శ అయినా.. పలుకరింపు అయినా.. మరింకేమైనా సరే.. కొద్ది మందికి మాత్రమే పరిమితం అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. తన నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకున్న దానికి సంబంధించి కూడా ఆయన ప్రవర్తించే తీరు అభ్యంతరకరంగా ఉందంటున్నారు. శ్రీశైలం విద్యుత్ ఫ్లాంట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. అందులో నలుగురు హైదరాబాద్ కు చెందిన వారు. వారిలో ఇద్దరు హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోకి వస్తారని చెబుతున్నారు.

అలాంటివేళ.. ప్రమాదంలో మరణించిన వారిని పరామర్శించేందుకు బయటకు వచ్చిన మజ్లిస్ అధినేత.. విద్యుత్ శాఖలో పని చేసే ఏఈ ఉజ్మా ఫాతిమా కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె కుటుంబానికి త్వరగా సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ లోని అజాంపురా హరిలాల్ బాగ్ లో ఉన్న ఆమె ఇంటికి వెళ్లిన అసద్.. వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.

విద్యుత్ కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకున్న వేళ.. ఫాతిమా ప్రదర్శించిన ధైర్యం అందరికి స్ఫూర్తిదాయకమన్న ఆయన.. ప్రమాదంలో తాను బయటపడే అవకాశం ఉన్నా.. ఇతరుల్ని కాపాడే క్రమంలో మరణించిందని గుర్తు చేశారు. ఆమె కుటుంబానికి త్వరగా సాయం అందాలన్నారు. చిన్నతనం నుంచి ధైర్యశాలిగా ఉండే ఆమె.. చదువులోనూ ముందుండేదన్నారు. నిజమే.. ఫాతిమా ధైర్యసాహాసాల్ని.. తనతోటి వారిని కాపాడేందుకు పడిన తపను ప్రశంసించటం అందరూ చేయాల్సిందే.

కానీ.. తన నియోజకవర్గ పరిధిలోనే మరొకరు కూడా మరణించిన విషయాన్ని మర్చిపోకూడదు. ఫాతిమా కుటుంబానికి వెళ్లిన ఆయన.. మరో డీఈ ఇంటికి వెళ్లకపోవటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. మిగిలిన విషయాల్ని పక్కన పెట్టేసినా..తన నియోజకవర్గ పరిధికి సంబంధించి ఒకే ఘటనలో ఇద్దరు మరణిస్తే.. ఒకరింటికి వెళ్లి పరామర్శించిన అసద్.. మరొకరి ఇంటికి కూడా వెళ్లి ఉంటే బాగుండేదంటున్నారు. ఒకవేళ.. ఆ ఇంట్లోని వారు లేకుంటే..అదే విషయాన్ని మీడియా ముందు ప్రస్తావించినా బాగుండేదన్న మాట వినిపిస్తుంది. పరామర్శలోనైనా సమన్యాయం ప్రదర్శిస్తే బాగుండేది కదా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. దీనికి ఆయనేం బదులిస్తారో?