Begin typing your search above and press return to search.

నెట్‌ ఫ్లిక్స్‌ లో 'మోగ్లీ' తెలుగు ఫ్రీఫ్రీ

By:  Tupaki Desk   |   9 Dec 2018 8:10 AM GMT
నెట్‌ ఫ్లిక్స్‌ లో మోగ్లీ తెలుగు ఫ్రీఫ్రీ
X
గ‌త కొంత‌ కాలంగా హాలీవుడ్ సినిమాలు ఇండియాపై దండ‌యాత్ర చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డి నుంచి దాదాపు రూ.300కోట్లు సునాయాసంగా వ‌సూలు చేస్తున్నాయి. ఆ కోవ‌లోనే ఇదివ‌ర‌కూ రిలీజైన `ది జంగిల్ బుక్` చిత్రం భార‌త‌దేశంలో సంచ‌ల‌న విజ‌యం సాధించి ఏకంగా 300కోట్లు కొల్ల‌గొట్టింద‌ని స‌మీక్ష‌కులు తెలిపారు.

ప‌చ్చ‌ని అడ‌వులు .. జంతు ప్ర‌పంచం మ‌ధ్య పెరిగే మోగ్లీ అనే కుర్రాడి క‌థతో తెర‌కెక్కిన `ది జంగిల్ బుక్` పిల్ల‌ల‌కే కాకుండా పెద్ద‌ల‌కు పిచ్చిగా నచ్చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఆ సినిమాకి సీక్వెల్ తెర‌కెక్కుతోందంటూ బోలెడంత ప్ర‌చారం సాగింది. అది ఇండియాలో రిలీజైతే 3డిలో చూసేయాల‌ని అభిమానులు వేచి చూశారు. కానీ ఫ్యాన్స్‌ ని నిరాశ‌ప‌రుస్తూ ఆ సినిమా ఇండియాలో రిలీజ్ కాలేదు. స‌రిక‌దా.. అమెరికాలాంటి చోట కూడా ప‌రిమిత స్క్రీన్ ల‌లో రిలీజైంది. దీనిని ఇప్పుడు ప్ర‌ఖ్యాత ఆన్‌ లైన్ స్ట్రీమింగ్ దిగ్గ‌జం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుని ఆన్‌ లైన్ యాప్‌ లో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతోంది.

ఇప్ప‌టికే మోగ్లీ రివ్యూలు వ‌చ్చాయి. షేర్ ఖాన్ (పెద్ద పులి)కి - మ్యాన్ క‌బ్ మోగ్లీకి మ‌ధ్య సాగే యుద్ధం నేప‌థ్యంలో.. తోడేళ్ల గుంపు మ‌ధ్య తోడేలు బ‌లంతో పెరిగే మోగ్లీ అడ‌విలో ఏం చేశాడు? అన్న క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కింది. వాస్త‌వానికి జంగిల్ బుక్ సిరీస్ ఇప్ప‌టిది కాదు. 1983లో బుక్ సిరీస్ రూపంలో వ‌చ్చిన దీనికి 1990లోనే దృశ్య‌రూపం ఇచ్చారు. అది కాల‌క్ర‌మంలో రూపాంత‌రం చెందుతూ ఇప్ప‌టికి భారీ 3డి చిత్రాల రూప‌క‌ల్ప‌న‌కు తెర‌తీసింది. ఏదైతేనేం.. ఇప్పుడు మోగ్లీ ని నెట్‌ఫ్లిక్స్ లైవ్‌ లోకి తెస్తోంది. అది కూడా ఇండియాలో ప్రాంతీయ భాష‌ల్లోనూ అభిమానుల‌కు అందుబాటులోకి తెస్తోంది. ఇంగ్లీష్ - హిందీ - తెలుగు భాష‌ల్లో మోగ్లీ చిత్రాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేయ‌నుంద‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు నెట్‌ ఫ్లిక్స్ వివ‌రాలు అందించింది. వాస్త‌వానికి మోగ్లీ చిత్రాన్ని ఈ అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్‌ లో రిలీజ్ చేయాల‌ని భావించిన వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ సినిమా రైట్స్‌ ని డిజిట‌ల్‌ కి అమ్మేయ‌డంతో ఇక థియేట్రిక‌ల్ రిలీజ్ లేన‌ట్టేన‌ని చెబుతున్నారు. 3డి రిలీజ్ లేదు.. థియేట్రిక‌ల్ రిలీజ్ లేదు.. లైవ్ స్ట్రీమింగ్ ఓన్లీ అని తెలుస్తోంది.