Begin typing your search above and press return to search.

ఎగ్జిబిటర్ల మీద అంత ప్రేమ ఉంటే...?

By:  Tupaki Desk   |   24 Dec 2021 4:30 PM GMT
ఎగ్జిబిటర్ల మీద అంత ప్రేమ ఉంటే...?
X
ఎగ్జిబిటర్లు ఎన్నడూ లేని కష్టాల్లో ఇపుడు ఉన్నారు. అది నిజం. ఎందుకంటే కరోనా రెండు దశలు చూసిన తరువాత ఎందుకు థియేటర్లు నడుపుతున్నామా అన్న ఆలోచన, భయం వారిలో కలిగింది. అదే సమయంలో గత కొన్నేళ్ళుగా సినిమా రంగం పరిస్థితిని వచ్చిన మార్పులను తీసుకుంటే థియేటర్లు నడపడం వృధా అనుకున్న వారూ ఉన్నారు.

సినిమా థియేటర్ అంటే ఏకంగా మూడు వందల అరవై రోజులూ కధ నడపాలి. రోజుకు నాలుగు ఆటలు వంతున సినిమా ఆడించాలి. ఇక సినిమా కలెక్షన్లతో సంబంధం లేకుండా టాక్సులు కట్టాలి. థియేటర్ల సిబ్బందికి జీతాలూ చెల్లించాలి. విద్యుత్ బిల్లులూ కట్టాలి.

మరి ఇన్ని చేసినా అనుకున్నట్లుగా సినిమా హాళ్లకు కనీసపు ఆదాయం వస్తుందా అంటే ఇటీవల కాలంలో బాగా తగ్గిపోయింది అనే చెప్పాలి. దానికి టాలీవుడ్ లో మారిన పరిస్థితులు. పెద్ద హీరోల సినిమాలు అన్నీ కూడా సీజన్లు పెట్టుకుని మరీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఒకేసారి వందల వేల ధియేటర్ల్లో బొమ్మ పడిపోతోంది. తాము అనుకున్న కలెక్షన్ల టార్గెట్ రీచ్ కాగానే సినిమా తీసేస్తున్నారు.

ఆ మీదట నెల తిరగకుండానే ఓటీటీలో వచ్చేస్తోంది. ఆ తరువాత మూడు నెలలు తిరగకుండా టీవీల‌లో వస్తోంది. దాంతో నష్టపోయేది ఎగ్జిబిటర్లే. ఎందుకంటే ఒక సినిమా కనీసం నాలుగు వారాలు అడితేనే తప్ప థియేటర్లకు ఫీడింగ్ ఉండదు, కొత్త సినిమా ఏది వచ్చినా గట్టిగా నాలుగు రోజులు ఆడకపోతే ఎలా. ఇక వారం పది రోజులలో హిట్ అయిన బొమ్మ కూడా వెళ్ళిపోతే మిగిలిన రోజులు ఏ సినిమా పెట్టి థియేటర్లలో ఆడించుకోవాలి.

ఇక చిన్న సినిమాలు తీసే వారికి ఇపుడు ఓటీటీ ఒక ఆప్షన్ గా ఉంది. దాంతో వారు కరోనా వంటి విపత్తులలోనే కాదు మామూలు రోజుల్లో కూడా బొమ్మను గిట్టుబాటు ధరను చూసుకుని మరీ అటు ఇచ్చేస్తున్నారు. అంటే అటు పెద్ద బొమ్మ నిలవక ఇటు చిన్న సినిమా చిక్కక సినిమా థియేటర్లు కూడా సీజనల్ బిజినెస్ చేయడమే మిగిలింది అని ఎగ్జిబిటర్లు వాపోతున్నారు.

ఇపుడు ఏపీ సర్కార్ టికెట్ల రేట్లు తగ్గించింది. సరే రేపటి రోజున వత్తిడి పెరిగి పెంచినా కూడా థియేటర్లు సవ్యంగా నడుస్తాయా అంటే దానికి ఠికాణా లేదు. ఎందుకంటే టాలీవుడ్ లో ఇదే రకమైన పరిస్థితి కాబట్టి. మరి టికెట్ల ధరలు పెంచండి అంటున్న వారు కానీ గట్టిగా గర్జిస్తున్న వారు కానీ తమ సినిమాలను థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని చెప్పగలరా. అంతే కాదు, పండుగలు,సెలవులూ కాకుండా మూడు వందల అరవై రోజులూ థియేటర్లకు ఫీడింగ్ ఇస్తామని గట్టిగా ఒట్టేయగలరా. అంటే తమ పబ్బం గడుపుకునేందుకు మాత్రమే ఎగ్జిబిటర్ల మీద ప్రేమ చూపిస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయంటే ఆలోచించాల్సిందే కదా.

ఏది ఏమైనా ఇదే సీన్ మరి. అరయంగ కర్ణుడీల్గె ఆర్గుని చేతన్ అని ఒక పద్యం భారతంలో ఉంది. అలాగే థియేటర్ల వ్యవస్థ ఇలా కుప్ప కూలడానికి ఈ రోజు ఎదురుగా ప్రభుత్వం ఉందని తప్పు చూపుతున్నారు. అది నిజమే కావచ్చు, కానీ సినిమా మేకర్స్ పెద్దలు కూడా తమ స్వార్ధం తాము చూసుకోవడం వల్లనే థియేటర్లు ఈ దుస్థితికి చేరుకున్నాయని అంటున్నారు. మరి దీని మీద ఎవరైనా గట్టిగా నిలబడితేనే ఫ్యూచర్ లో థియేటర్ అనబడే అందమైన వినోద సాధనం జనం కళ్ల ముందు ఉంటుంది. లేకపోతే అది ఒక కలగానే మారినా ఆశ్చర్యపడనక్కరలేదేమో.