Begin typing your search above and press return to search.

డిమాండ్లు తీరేవ‌ర‌కూ ఉద్యమం ఆగ‌దు

By:  Tupaki Desk   |   13 Dec 2021 7:36 AM GMT
డిమాండ్లు తీరేవ‌ర‌కూ ఉద్యమం ఆగ‌దు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల ఆగ్ర‌హం ఇప్ప‌ట్లో చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు. త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ఇప్ప‌టికే పోరుబాట ప‌ట్టారు.

త‌మ 71 డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం తీర్చేవ‌ర‌కూ ఉద్య‌మం సాగుతుంద‌ని అంటున్నారు. పీఆర్సీ ప్ర‌క‌ట‌న‌తో పాటు పీఆర్సీ నివేదిక‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌, సీపీఎస్ ర‌ద్దు, హెల్త్ కార్డు త‌దిత‌ర స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని ఉద్యోగులు కొంత కాలం నుంచి డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

పీఆర్సీ ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తూ ఉద్య‌మానికి సిద్ధ‌మైన ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఈ నెల 3న‌ సీఎం జ‌గ‌న్ గుడ్‌న్యూస్ చెప్పారు. ప‌దిరోజుల్లో పీఆర్సీ ప్ర‌క‌టిస్తామ‌న్నారు. తిరుప‌తిలోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌ను ప‌రిశీలిస్తున్న ఆయ‌న ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న చేశారు. కానీ ముఖ్య‌మంత్రి చెప్పిన గ‌డువుకు మ‌రొక్క రోజు మాత్ర‌మే మిగిలి ఉన్న‌ప్ప‌టికీ పీఆర్సీ ప్ర‌క‌ట‌న దిశ‌గా ఎలాంటి క‌స‌ర‌త్తులు జ‌ర‌గడం లేద‌ని తెలుస్తోంది.

దీంతో ఈ నెల 7 నుంచే త‌మ డిమాండ్ల సాధ‌న కోసం ఆందోళ‌న‌లు చేస్తున్న ఉద్యోగులు పీఆర్సీ విషయంలో ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రిస్తున్నారు. తెలంగాణ‌లో 30 శాతం ఫిట్‌మెంట్ ప్ర‌క‌టించార‌ని ఏపీలో కూడా అంత‌కు త‌గ్గ‌కుండా చూడాల‌ని ఏపీ ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాస‌రావు డిమాండ్ చేశారు.

ఈ నెల గ‌డిస్తే మ‌రో డీఏ వ‌స్తుంద‌ని.. మొత్తం పెండింగ్‌లో ఉన్న 8 డీఏల‌ను ప్ర‌భుత్వం వెంట‌నే విడుద‌ల చేయాల‌ని శ్రీనివాస రావు అన్నారు. పీఆర్సీ నివేదిక‌పై ప్ర‌భుత్వానికి, ఉద్యోగుల‌కు మ‌ధ్య కొద్ది రోజులుగా చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ప్ర‌భుత్వం త‌మ డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించ‌డం లేద‌ని అసంతృప్తితో ఉద్యోగ సంఘాల నేత‌లు ధ‌ర్నాకు దిగారు.

పీఆర్సీపై గ‌త నెలాఖ‌రు లోపు స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేయ‌కుంటే ఉద్య‌మాన్ని ఉద్ధృతం చేస్తామ‌ని కూడా హెచ్చరించారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న వారికి ఊర‌ట‌నిచ్చింది. కానీ త‌మ మొత్తం డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించేంత‌వ‌ర‌కూ వెన‌క్కిత‌గ్గ‌బోమ‌ని ఉద్యోగులు ప‌ట్టుబ‌ట్టి కూర్చున్నారు. తాము ఇచ్చిన 71 డిమాండ్ల‌లో ప్ర‌ధాన‌మైన పీఆర్సీ, సీపీఎస్ ర‌ద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ వంటి స‌మ‌స్య‌ల‌ను ఎలా ప‌రిష్కారిస్తారో
చెప్పాల‌ని వాళ్లు డిమండ్ చేస్తున్నారు.