Begin typing your search above and press return to search.

కేసీఆర్ గారూ.. మోత్కుప‌ల్లి ఆవేద‌న విన్నారా?

By:  Tupaki Desk   |   19 Dec 2017 11:38 AM GMT
కేసీఆర్ గారూ.. మోత్కుప‌ల్లి ఆవేద‌న విన్నారా?
X
ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల పేరిట హైద‌రాబాదులో జ‌రుగుతున్న స‌భ‌లు నేటితో ముగియ‌నున్నాయి. పేరుకు ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లే అయినా... ఆ స‌భ‌ల నిర్వ‌హ‌కుడి బాధ్య‌త‌ల్లో ఉన్న తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు... వాటిని తెలంగాణ మ‌హాస‌భ‌లను చేశార‌న్న విమ‌ర్శ‌లు బాగానే వినిపిస్తున్నాయి. తెలుగు ప్రజ‌ల ఆత్మ గౌర‌వాన్ని కాపాడ‌టంతో పాటుగా తెలుగోడి స‌త్తాను విశ్వ‌వ్యాప్తం చేసేందుకేనంటూ తెలుగు దేశం పార్టీ పేరిట రాజ‌కీయ పార్టీ పెట్టి సంచ‌ల‌నం సృష్టించిన స్వర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావును ఈ స‌భ‌ల్లో స్మ‌రించుకునే విష‌యాన్ని పూర్తిగా మ‌రిచిపోయిన కేసీఆర్‌ పై స‌ర‌త్రా విమ‌ర్శ‌లు రేకెత్తుతున్నాయి.

ఈ విషయంపై ఓ తెలుగు త‌మ్ముడు స‌భ‌ల ప్రారంభం రోజునే... ఏపీ - తెలంగాణ‌ల‌ను క‌లుపుతున్న జాతీయ ర‌హ‌దారిపై న‌డిరోడ్డుపైనే గుండు గీయించుకుని మ‌రీ నిర‌స‌న వ్య‌క్తం చేశాడు. ఈ నిర‌స‌న పెద్ద సంచ‌ల‌నంగానే మారింది. అయితే ఈ నిర‌స‌న‌ను జ‌నం మ‌రిచిపోయేలా వ్యూహం ర‌చించిన కేసీఆర్ స‌ర్కారు... అస‌లు అన్న‌గా పిలుచుకునే ఎన్టీఆర్‌ ను స్మ‌రించే ప‌నికి పూనుకోలేదు. ఈ నేప‌థ్యంలో స‌భ‌ల ముగింపు రోజున టీ టీడీపీ సీనియ‌ర్ నేత‌ - రాజ‌కీయాల్లో కేసీఆర్‌ తో స‌మకాలికుడిగా పేరున్న మెత్కుప‌ల్లి న‌ర్సింహులు చాలా ఆవేద‌నాపూరిత స్వ‌రంతో గొంతు విప్పారు. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల పేరిట జ‌రుగుతున్న ఈ స‌భ‌లు ఎన్టీఆర్‌ను మ‌రిచిపోవ‌డం చాలా బాధాక‌ర‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. నేటి ఉద‌యం మీడియా ముందుకు వ‌చ్చిన న‌ర్సింహులు... కేసీఆర్‌ కు ప‌లు సూటి ప్ర‌శ్న‌లు సంధించారు.

స‌భ‌ల ప్రారంభోప‌న్యాసంలో గురువుల‌ను గుర్తు చేసుకున్న కేసీఆర్ ప్ర‌సంగాన్నే ఆస‌రా చేసుకుని మోత్కుప‌ల్లి సంధించిన ఈ ప్ర‌శ్న‌లు ఇప్పుడు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. చదువుచెప్పిన గురువుకు నమస్కరించిన కేసీఆర్... రాజకీయ గురువుకు దండం పెట్టవల్సిన బాధ్యత లేదా..? అని కేసీఆర్‌ను మోత్కుప‌ల్లి సూటిగా ప్రశ్నించారు. తెలుగు మహాసభల్లో ఎన్టీఆర్‌ ను విస్మరించడంపై ప్రపంచంలోని తెలుగువారంతా బాధపడుతున్నారని, ఈ చ‌ర్య‌తో కేసీఆర్‌ పరిపక్వత లేకుండా వ్యవహరిస్తున్నాడని మోత్కుపల్లి ఆరోపించారు. కేసీఆర్‌ తో సహా ఎంతోమందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని - తెలుగు జాతి ఔన్నత్యాన్ని పెంచిన మహనీయుడిగా ఆయ‌న ఎన్టీఆర్ ను కీర్తించారు. అలాంటి మ‌హ‌నీయుడిని విస్మరించడం బాధాకరమని మోత్కుపల్లి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.