Begin typing your search above and press return to search.

తల్లులు తీర్చిదిద్దిన నాయకులు

By:  Tupaki Desk   |   8 May 2022 9:53 AM GMT
తల్లులు తీర్చిదిద్దిన నాయకులు
X
కుటుంబంలో తల్లి పాత్ర చాలా ఎక్కువ అని చెబుతారు. ఆమె ప్రభావం బిడ్డల మీద ఉంటుంది. తండ్రి సంపాదన నిమిత్తం వేరే వ్యాపకాల్లో పడి ఉంటాడు. అలాంటపుడు రోజులో అత్యధిక భాగం పిల్లలు ఉండేది తల్లి వద్దనే. ఆ తల్లి తీర్చిదిద్దితే వారు మహా నాయకులు అవుతారు. ఇది భారతీయ చరిత్ర చెప్పిన సత్యం.

నాడు చత్రపతిశివాజీని తల్లి జిజియాబాయ్ తీర్చిదిద్దింది. ఆయన ఢిల్లీ పాలకుల మీద దండెత్తి తన పౌరుషాన్ని చాటి చక్రవర్తి అయ్యారు అంటే తల్లి శిక్షణ, పెంపకం వల్లనే అదంతా సాధ్యమైంది. ఇక ఆధునిక కాలంలో కూడా తల్లుల చేయూత వల్ల వారి తర్ఫీదుతో ఎందరో మేటి నాయకులుగా మారారు.

మన దేశానికి ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ తల్లి శిక్షణలోనే ఇంతటి స్థాయిని సంపాదించారు. ఆయన 140 కోట్ల మంది భారతీయులకు తండ్రి స్థానంలో ఉన్నా తన అలసట అంతా తల్లి హీరాబెన్ వద్దకు వచ్చి తీర్చుకుంటారు. తల్లితో గడిపిన క్షణాలనే ఆయన అత్యంత మధురంగా భావిస్తారు.

తల్లితో కలసి చేసే భోజనం మోడీకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. తల్లి ప్రేమలోనే ఆయన తన్మయత్వం పొందుతారు. అమ్మ ప్రేమ అంటేనే అది. ఇక దేశంలో అతి పెద్ద రాష్ట్రం యూపీకి రెండవసారి వరసగా ముఖ్యమంత్రి అయిన యోగీ ఆదిత్యనాధ్ కూడా మాతృమూర్తికి వందనం చేస్తారు. ఆయన తల్లి నీడలోనే పెరిగి ఇంతటి వారు అయ్యారు.ఈ మధ్యనే ఉత్తరాఖండ్‌లోని స్వగ్రామం పంచూర్ వెళ్లి తన తల్లి సావిత్రీదేవి ఆశీస్సులు తీసుకున్నారు. ఆమెతో చాలా సేపు గడిపి ఎంతో ఉల్లాసాన్ని కొత్త అనుభూతులను పొందారు.

ఇక కాంగ్రెస్ వర్తమాన తరం నాయకుడు రాహుల్ గాంధీ విషయం తీసుకుంటే ఆయన అమ్మ కూచిగా పేరుపొందారు. రాహుల్ గాంధీని ప్రతీ అడుగులో సలహా సూచనలు ఇచ్చి తీర్చిదిద్దింది సోనియా గాంధీ. తల్లితోనే రాహుల్ తన మనసులోని బాధలను అన్నీ చెప్పుకుంటారు. ఒక విధంగా వీరిద్దరి మధ్య తల్లీకొడుకుల బంధం కంటే కూడా స్నేహ బంధమే ఎక్కువగా కనిపిస్తుంది.

ఇక మరో కీలక నేత, బీహార్ కి చెందిన రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వీ యాదవ్ తల్లి రబ్రీదేవి అదుపాజ్ఞలలోనే పెరిగాడు. తల్లి నుంచే ఆయన రాజకీయం పూర్తిగా నేర్చుకున్నారు. రబ్రీదేవి కూడా రాజకీయాల్లో రాటుదేలారు. ఆమె బీహార్ కి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అందుకే ఆమె తనయుడికి రాజకీయాలకు సంబంధించి ఎన్నో సలహా సూచనలు ఇస్తూ ఉంటారు. అలా తేజస్వీ యాదవ్ రాజకీయ విజయాల వెనక తల్లి రబ్రీదేవి పాత్ర కీలకం అని చెప్పాలి.

ఇక కాంగ్రెస్ లో ఉన్న మరో కీలక నాయకుడు శశిధరూర్ కూడా తల్లి ప్రస్థావన ఎక్కువగా తెస్తూంటారు. తాను రాసే పుస్తకాల్లో కూడా తల్లి లిల్లీ ధరూర్ గురించి చెబుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీ వాదాన్ని అర్ధం చేసుకోవడానికి, తన స్వెచ్చా జీవన విధానానికి తల్లి ప్రభావమే కారణం అని శశిధరూర్ చెబుతారు.

ఇక ఈ రోజు ఢిల్లీకి రాజ్ అంటే ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కూడా తల్లి చాటు బిడ్డ అంటే నిజమనే చెప్పాలి. చిన్నతనం నుంచి అరవింద్ కేజ్రీవాల్ చదువుల్లో ఫస్ట్, అలాగే పేదలకు సాయం చేయడం నాటి నుంచే అలవాటు పడింది. అదంతా తన తల్లి గీతాదేవి ప్రభావం అని ఆయన చాలాసార్లు చెప్పుకున్నారు. ఈ రోజు కేజ్రీవాల్ పేదల కోసం అనేక పధకాలు తీసుకువస్తున్నారు. దాని వెనక తల్లి గీతాదేవి ఆలోచనలు నిండా ఉన్నాయని అంటారు

మొత్తానికి మన‌ ఇతిహాసాల్లో పురాణాల్లో తల్లి పాత్ర గురించి గొప్పగా ఉంటుంది. తల్లిని మించిన దైవం లేదన్నది మన పురాతన భావన. తల్లి తొలి దైవం కూడా. మరి ఆ తొలి గురువు తర్ఫీదుతో ఆమె చెక్కిన శిల్పాలుగా మన నాయకులు కళ్ళ ముందు కనిపిస్తున్నారు. వీరే కాదు ఇంకా చాలా మంది తల్లులు ఉన్నారు. వారి ప్రతిభకు, ప్రేమకు అంకిత భావానికి అంతర్జాతీయ‌ మాతృ దినోత్సవం సందర్భంగా అభినందనలు చెప్పాల్సిందే.