Begin typing your search above and press return to search.

అమ్మతనానికి మాయని మచ్చగా పసికందుపై పైశాచికం

By:  Tupaki Desk   |   12 April 2022 12:32 PM GMT
అమ్మతనానికి మాయని మచ్చగా పసికందుపై పైశాచికం
X
అమ్మతనమే కమ్మదనం. సృష్టిలో అది తియ్యదనం. అమ్మలోని ప్రేమకు అంతే ఉండదు. సముద్రానికి కొలత లేనట్లే అమ్మ ప్రేమకు కూడా అంతు ఉండదు. అలాంటి ప్రేమ లేని వారు నిజంగా అనాథలే. అమ్మ గురించి వర్ణించని కవి ఉండడు. అమ్మ గురించి ఆలోచించని మనసు ఉండదు. మనిషి ఉండడు. అందుకే అమ్మకు అంతటి విలువ. చెడ్డ పిల్లలు ఉంటారేమో కానీ చెడ్డ అమ్మ ఉండదనేది నిర్వివాదాంశం. తనకు లేకపోయినా తన పిల్లలకు పెట్టుకుని అమ్మ పడే సంతోషం అంతా ఇంతా కాదు. అలాంటి అమ్మ ప్రేమకు నిర్వచనమే లేదు. ఎంత చెప్పినా తక్కువే.

అయితే తులసీవనంలో గంజాయి మొక్కలాగా ఎక్కడో ఒక చోట కసాయి తల్లి కూడా ఉంటుంది. ఎందుకంటే పరిస్థితుల ప్రభావమో ఇంకా ఏదో కారణావైనా తల్లి ప్రేమ ఇక్కడ కసాయితనంగా మారింది. తన పాపను ముద్దాడుతూ తనివితీరా ప్రేమ నింపే ఆమె కర్కశంగా మారింది. కడుపులో పెట్టుకుని చూడాల్సిన తొమ్మిది నెలల పసికందుపై కర్కశం ప్రదర్శించింది.

పాపను చెంపలు ఎడాపెడా వాయిస్తూ తన కోపం ప్రదర్శించింది. పాపం పసికందుకు ఏం జరుగుతుందో తెలియదు. ఎవరు కొడుతున్నారో తెలియదు.కానీ దెబ్బలకు మాత్రం ఏడుపు లంకించుకుంది. తన తల్లే ఇలా చేస్తుందని ఆమెకు ఏం తెలుసు. తన పట్ల ఇంత దారుణంగా వ్యవహరించేంది కన్న తల్లి అని పాపకు మాత్రం ఎలా అర్థమవుతుంది.

జమ్ముకశ్మీర్ లోని సాంబా జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. తొమ్మిది నెలల పసికందును తల్లి తన ఒడిలో పట్టుకుని చెంపదెబ్బలు కొడుతుంటే కొంతమంది చాటుగా వీడియో తీసి దాన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. దీంతో ఈ కసాయి తల్లి బాగోతం బయటకు వచ్చింది. దీంతో పాప తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సదరు మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తల్లి ప్రేమ మనుషుల్లోనే కాదు జంతువులు, పక్షుల్లో కూడా ఉంటుంది. జంతువులు సైతం తమ పిల్లలను ఏదైనా పట్టుకోవాలని చూస్తే వెంట పడి తరిమికొడతాయి. తమ పిల్లల సంరక్షణకు అంతగా ప్రాధాన్యం ఇస్తాయి. ఒకవేళ ఎదుటి జంతువు ధాటికి తట్టుకోలేకపోతే తెగ బాధపడతాయి. తమ పిల్లల రక్షణకు శాయిశక్తులా పోరాటం చేస్తాయి. అంతటి మహత్తర శక్తి ఒక తల్లికే ఉంటుంది. అంతటి మహత్తర ప్రేమ కలిగిన మాతృమూర్తి ప్రేమకు తెగులు పట్టిందా? కన్న ప్రేమ కర్కశంగా మారిందా? అనే సమాధానాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.