Begin typing your search above and press return to search.

అఫ్గాన్ దేశ ప్రధానిగా.. అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది

By:  Tupaki Desk   |   8 Sep 2021 4:13 AM GMT
అఫ్గాన్ దేశ ప్రధానిగా.. అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది
X
నాగరిక ప్రపంచంలో తోపు దేశాలుగా తమ గురించి తాము గొప్పగా చెప్పునే దేశాధినేతలు.. దేశాలు సిగ్గుపడే పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రవాదం ఎక్కడున్నా కూకటివేళ్లతో పెకిలిస్తామని బీరాలు పలికే అగ్రరాజ్యాల మాటల్లో పస ఎంతన్న విషయాన్ని కళ్లకు కట్టేలా తాజాగా అఫ్గాన్ లో పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా.. దాని మిత్రదేశాల సైన్యం అఫ్గాన్ ను విడిచి పెట్టి వెళ్లిపోయిన వేళ.. ఆ దేశం తాలిబన్ల వశం కావటం తెలిసిందే. తాజాగా ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొలువు తీరనున్నట్లుగా తాలిబన్లు ప్రకటించారు.

అమెరికా సేనలు పూర్తిస్థాయిలో వైదొలిగిన వారం తర్వాత తమ తాత్కాలిక కేబినెట్ ను ప్రకటించిన తాలిబన్లు ప్రపంచానికి తనదైన రీతిలో షాకిచ్చారు. దేశ ప్రధానిగా అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అఖుంద్ ను నియమించగా.. మరో ఉగ్రవాది సిరాజ్ హక్కానీకి అంతర్గత భద్రతను అప్పగించారు. ఉప ప్రధానులుగా బరాదర్.. అబ్దుల్ సలామ్ హనీఫ్ కు కళ్లాలు అప్పటించారు.

ఇప్పటివరకు అఫ్గాన్ ప్రధానిగా బాధ్యతలు చేపడతారని భావించిన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ఉప ప్రధానిగా ఎంపికయ్యారు. మరో 30 మందితో కేబినెట్ మంత్రులు.. సహాయ మంత్రులతో పాటు.. నిఘా విభాగం.. సెంట్రల్ బ్యాంకు చీఫ్ జాబితాను విడుదల చేశారు. తాజాగా అమెరికాకు షాకిచ్చారు తాలిబన్లు. ఖతార్ లో ఉన్న అమెరికా విదేశాంగ శాఖా మంత్రి ఆంటోని బ్లింకెన్ విలేకరులతో మాట్లాడుతూ.. తాలిబన్లు తమ డిమాండ్లకు ఒప్పుకున్నారని.. దేశం నుంచి వెళ్లి పోవాలని భావించే ఆఫ్గాన్లు.. అమెరికా పౌరులను అనుమతిస్తారని చెప్పారు.

ఆయన ప్రకటన వెలువడిన గంటలోనే విదేశీ ప్రయాణాల మీద బ్యాన్ విధిస్తూ తాలిబన్లు హుకుం జారీ చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు అఫ్గాన్ నుంచి విదేశీ ప్రయాణాలపై నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో.. అమెరికా మాటకు తాలిబన్లు ఎంత మేర విలువ ఇస్తార్ స్పష్టమైన పరిస్థితి. అఫ్గాన్ లో ప్రస్తుతం కొలువు తీరిన తాత్కాలిక ప్రభుత్వంలో టాప్ లీడర్లలో ఎక్కువ మంది ఉగ్రవాద మూలాలు ఉన్న వారే కావటం గమనార్హం.

ఇదంతా చూస్తుంటే.. రానున్న రోజుల్లో మరెన్ని దరిద్రాల్ని ప్రపంచానికి తాలిబన్లు చూపిస్తారో? వీటిన్నింటిని అగ్రరాజ్యాలు కళ్లప్పగించి చూస్తుంటాయన్న మాట. నాగరిక ప్రపంచంలో ఇంతకు మించి దారుణం ఇంకేం ఉంటుంది చెప్పండి?