Begin typing your search above and press return to search.

రవిప్రకాష్ పోయాడు.. ఇక్కడ సంబరాలే

By:  Tupaki Desk   |   10 May 2019 5:54 PM GMT
రవిప్రకాష్ పోయాడు.. ఇక్కడ సంబరాలే
X
టీవీ-9 పదవి నుంచి రవిప్రకాష్ దిగిపోవడం చాలామందికి ఆనందం కలిగిస్తున్నట్లుంది. ఆ ఛానెల్లో ఉద్యోగుల్లో మెజారిటీ రవిప్రకాష్ వైపే ఉన్నారని.. ఆయనే సీఈవోగా కొనసాగాలని కోరుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. కానీ ఆ ఛానెల్‌ ను మినహాయిస్తే మాత్రం బయట మాత్రం రవిప్రకాష్ నిష్క్రమణ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొన్న తన మీద వస్తున్న ఊహాగానాలకు తెరదించడానికి టీవీ-9 స్టూడియోకు వచ్చి ఐదు నిమిషాల పాటు తెరపై కనిపించాడు రవిప్రకాష్. ఆ సందర్భంగా రవిప్రకాష్ వేరే ఛానెళ్ల వాళ్లకు సుద్దులు చెప్పాడు. విలువల గురించి, నైతికత గురించి మాట్లాడాడు. కానీ ఆ వీడియో లింక్ కింద కామెంట్లు చూస్తే జనాల్లో రవిప్రకాష్ పట్ల ఎంత వ్యతిరేకత ఉందన్నది అర్థమైపోతుంది. ఆయనకు మద్దతుగా ఒక్క కామెంట్ లేదు. ప్రతి ఒక్కరూ రవిప్రకాష్‌ ను తిట్టేవాళ్లే. రవిప్రకాష్ విలువల గురించి మాట్లాడుతుంటూ దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నట్లు అందరూ వ్యాఖ్యలు చేశారు.

టీవీ-9 రవిప్రకాష్ బాధితుల్లో వివిధ రంగాల వాళ్లున్నారు. సినీ పరిశ్రమ నుంచి కూడా చాలామంది బాధితులున్నారు. వాళ్లంతా ఇప్పుడు రవిప్రకాష్‌ పై వేటు పడటంతో చాలా సంతోషంగా ఉన్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ పెళ్లి వ్యవహారాన్ని మొదలుపెడితే.. రకరకాల ఇష్యూల సమయంలో రవిప్రకాష్ నేతృత్వంలోని టీవీ-9 హద్దులు దాటింది. కొన్నిసార్లు బరితెగించేశారన్న విమర్శలు తీవ్ర స్థాయిలో ఉన్నారు. టీఆర్పీ రేటింగుల కోసం ఎంతకైనా దిగజరాతుతుందనే అభిప్రాయం రవిప్రకాష్ నేతృత్వంలోని టీవీ-9 మీద ఉంది. ఈ ఛానెల్ సక్సెస్ కావడంతో మిగతా టీవీ ఛానెళ్లు కూడా అదే బాట పట్టాయి. మామూలుగానే మీడియా దృష్టి సినిమా వాళ్ల మీద ఎక్కువగా ఉంటుంది. ఇక టీవీ-9 అయితే సినీ పరిశ్రమలోని వ్యక్తులకు సంబంధించి చిన్న వివాదం బయటపడితే చాలు.. దాని మీద గంటలు గంటలు ప్రోగ్రాంలు నడిపి వాళ్ల ప్రతిష్టను, ప్రైవసీని బాగా దెబ్బతీసింది. దీని వెనుక రవిప్రకాష్ ఉన్నాడన్నది స్పష్టం. ఈ నేపథ్యంలో ఆయన సీఈవోగా తప్పుకున్నట్లు తెలియగానే సినీ జనాలంతా చాలా హ్యాపీగా ఉన్నారని.. హర్షం ప్రకటిస్తున్నారని తెలుస్తోంది.