Begin typing your search above and press return to search.

ఐపీఎల్ వీరాధివీరులు వీరే!

By:  Tupaki Desk   |   15 Sep 2020 11:30 PM GMT
ఐపీఎల్ వీరాధివీరులు  వీరే!
X
ఐపీఎల్ అంటేనే ధనాధన్ ఆట. ఇక్కడ మన సాంప్రదాయ ఆట కనిపించదు. వచ్చామా.. ఎడాపెడా బాదామా.. అన్నట్టుంటుంది వ్యవహారం. ఐ పీఎల్ లో ప్రతి బ్యాట్స్ మెన్ కు ఎక్కువ బంతులు ఆడే అవకాశం ఉండదు. ఉన్న ఆ కాసేపు మెరుపులు మెరిపించాలనే చూస్తారు. ఐపీఎల్లో కోహ్లి, రైనా పరుగుల పరంగా మొదటి రెండో స్థానాల్లో ఉండి ఎన్నో మ్యాచులు గెలిపించి ఉండొచ్చు. కానీ జట్టుకు అవసరమైన స్థితిలో వచ్చి విజయాన్ని అందించి పలువురు బ్యాట్స్ మెన్ తమ జట్లకు విజయాన్ని అందించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు అందుకున్నారు. టోర్నీలో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు అందుకున్న వారి వివరాలను పరిశీలిస్తే టాప్ ఫైవ్ లో ఉన్న వారు వీరే.

గేల్

గేల్ ఎక్కడ ఉంటే అక్కడ సునామీ, సుడిగాలి ఉంటుంది. అలా ఉంటుంది అతని బ్యాటింగ్ తీరు. ప్రపంచంలో ఎన్ని క్రికెట్ లీగ్ లు ఉంటే అన్ని లీగుల్లోనూ గేల్ సత్తా చాటాడు. అందుకే అతన్ని అందరూ యూనివర్సల్ బాస్ అంటారు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 125 మ్యాచులు ఆడిన గేల్ 21 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఆరు సెంచరీలు, 11 అర్థ సెంచరీలు సాధించాడు. మొదట్లో బెంగళూరు జట్టు తరఫున ఆడిన గేల్ ఆ తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడుతున్నాడు.

డివిలియర్స్

డివిలియర్స్ ఒక ప్రత్యేక ఆటగాడు. బంతిని ఏ యాంగిల్ లో అయినా.. ఏ దిశలో అయినా బాదగలడు. ధాటిగా బ్యాటింగ్ చేయగలడు. ఆర్సీబీ తరఫున ఆడుతున్న డివిలియర్స్ 142 ఐపీఎల్ ఇన్నింగ్స్ ఆడి ఇప్పటి వరకు 20 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. మూడు సార్లు సెంచరీలు, 16 అర్థ సెంచరీలు చేశాడు.

వార్నర్

ఇతడు ఐపీఎల్ స్పెషలిస్టు బ్యాట్స్మెన్. వార్నర్ కెప్టెన్ అయ్యాకే సన్ రైజర్స్ దశ తిరిగింది. ఓపెనర్ గా వచ్చి చెలరేగి పోతాడు. ధావన్ తో కలిసి ఓపెనర్గా ఎన్నో రికార్డులు సాధించాడు. వార్నర్ 17 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీలు అందుకున్నాడు. 126 మ్యాచ్ లు ఆడిన వార్నర్ 4706 పరుగులు చేశాడు. నాలుగు సెంచరీలు, 44 అర్థ సెంచరీలు సాధించాడు.

ఎం.ఎస్ ధోనీ
ధోని చెన్నై జట్టు కెప్టెన్. ఫినిషర్ గా వచ్చి ఆ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అత్యధిక సార్లు టైటిల్ గెలిచాడు. అత్యధిక సార్లు ఫైనల్కు చేరుకున్న జట్టు కూడా చెన్నై. ఆట చివర్లో వచ్చి ధనా ధన్ ఇన్నింగ్స్ ఆడటం ధోనీ స్పెషల్. 190 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన ధోనీ 23 అర్థ సెంచరీలు సాధించి 4432 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు 17 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించాడు.

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాకే ముంబై ఇండియన్స్ విజయాల బాట పట్టింది. చెన్నై తర్వాత అత్యధిక సార్లు టైటిల్ గెలిచిన జట్టు ముంబయి. చాలాసార్లు ఫైనల్స్ వరకూ వెళ్ళింది. ముందు స్లోగా ఆడుతూ తర్వాత చెలరేగి ఆడటం రోహిత్ శర్మకు అలవాటు. భారీ సిక్సర్లు అలవోకగా బాదగలడు. 183 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ 17 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఒక సెంచరీ పద్నాలుగు అర్ధ సెంచరీలు చేశాడు.