Begin typing your search above and press return to search.

బాబు సూప‌ర్ ప్లాన్ కామెడీ అయిపోయింది

By:  Tupaki Desk   |   4 March 2017 3:06 PM GMT
బాబు సూప‌ర్ ప్లాన్ కామెడీ అయిపోయింది
X
గ‌త ఏడాది ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు చేసిన కొత్త హడావుడి ఒక‌టి గుర్తుండే ఉంటుంది. ఏ ముఖ్య‌మంత్రి చేయ‌ని విధంగా దోమ‌లపై దండ యాత్ర పేరుతో బాబు కొత్త కార్య‌క్రమానికి శ్రీ‌కారం చుట్టారు. దోమ‌ల చిహ్నాలు ప‌ట్టుకొని వీలైన‌న్ని చోట్ల ప్ర‌చారం కూడా చేశారు. ఈ కార్య‌క్ర‌మం ఎలాంటి ఫ‌లితం ఇచ్చిందో తెలియ‌దు కానీ నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ముఖద్వార నగరంగా అభివృద్ధి చేస్తున్నామన్న విజయవాడ నగరంలో దోమల బెడద నగర ప్రజలకు నరకం చూపిస్తోంది. నానాటికీ అధిగమవుతున్న దోమల సమస్య పరిష్కారం కోసం వీఎంసీ ఖర్చు చేస్తున్న వ్యయం కంటే నగరవాసులు తమ గృహాల్లో వినియోగించే దోమల నివారణ ఉపకరణాల వ్యయం ఎక్కువగా కనిపిస్తోందనడంలో అతిశయోక్తిలేదు.

ఏపీ పరిపాల‌న‌కు కీల‌క‌మైన విజ‌య‌వాడ‌లో కోట్లు కుమ్మరించి చేపడుతున్న అభివృద్ధికి దోమల వృద్ధి ఒక సవాల్‌ గా మారింది. దోమ కాటుతో వ్యాప్తి చెందే మలేరియా - చికున్ గున్యా - డెంగ్యూ వంటి ప్రాణాంతక జ్వరాలు విజయవాడ నగరానికి శాశ్వత అతిథి రోగాలు. ప్రతి నెలా వైరల్ జ్వరాలు నమోదవుతూనే ఉన్నాయి. గత ఏడాది మొత్తం మీద 550 కేసులు నమోదైనట్టు అధికారిక లెక్కలే చెబుతుండగా నమోదు కాని జ్వర పీడుతుల సంఖ్య కూడా అంతే స్థాయిలో ఉంది. ఈనెల - ఆనెల అనేది లేకుండా జనవరి నుంచి డిసెంబర్ వరకూ దోమ సంచారం లేని రోజు ఉండదు, అలాగే దోమ కాటుకు గురై ప్రజలు అనారోగ్యానికి గురికాని నెల లేదనే చెప్పాలి. ప్రస్తుతం జనవరి - ఫిబ్రవరి నెలలోనే సుమారు 50 కేసుల వరకూ వైరల్ జ్వరాలు నమోదైనట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. కేవలం రాత్రి సమయాల్లోనే కాకుండా పగటి వేళల్లో కూడా దోమకాటు నగరానికి ప్రత్యేకమనే చెప్పాలి. ప్రపంచ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పర్చాలన్న నగర పాలకుల లక్ష్యానికి దోమకాటు ఒక అవరోధంగానే మారింది. దోమల నివారణకు అధికారికంగా చేపట్టే చర్యలకు తోడుగా ప్రజలు తమ పరిసరాలు - గృహ ఆవరణలలో కూడా ఆయా నియమ నిబంధనలను పాటిస్తేనే ఆశించిన ఫలితాలను చవిచూస్తామంటున్న అధికారుల వాదనకు కొంత నిజం ఉన్నా వారి లెక్కల ప్రకారం చేస్తున్న ఖర్చుకు - చర్యలకు దోమనేది కంటికి కనిపించకూడదు.

నగర పరిధి ప్రాంతాల్లో క్రమం తప్పకుండా దోమల నివారణ చర్యలు చేపడుతున్నామని చెబుతున్న అధికారుల లెక్కలు ఇలావున్నాయి. దోమల నివారణకు వీఎంసీ చేస్తున్న వార్షిక వ్యయాన్ని పరిశీలిస్తే ఎబేట్ - ఎంఎల్ ఆయిల్ ఖర్చు 46లక్షల 60వేలు - ఎంఎల్‌ టి పై రత్నం ఖర్చు 40లక్షల 40 వేల రూపాయలు సుమారుగా ఉంది. ఒకపక్క నివారణా చర్యలు - మరోపక్క దోమల వృద్ధి రెండూ సమాంతరంగా ఉన్నాయంటే నివారణా చర్యల్లో నెలకొన్న లోపాలను అంచనావేయవచ్చు. ఇదిలావుండగా దోమలపై యుద్ధం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం పట్టణ - నగరాల్లోనే కాక గ్రామాల్లో కూడా ఆశించిన ఫలితాలు సాధించలేదు. పాలకులు దోమలపై యుద్ధం ప్రకటించినా చివరికి ఆ యుద్ధంలో దోమలే గెలిచాయన్నది కాదనలేని వాస్తవం. యుద్ధం సమయంలో చేపట్టిన కార్యక్రమాల జాడ ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. వేసవిలో ఎండ వేడిమికి మనిషి ప్రాణాలే పోతుండగా దోమ మాత్రం నిక్షేపంగా జీవించి ఉంటుందంటే విజయవాడ నగర దోమ బలం ఏమిటో ఇక చెప్పాల్సిన అవసరమే లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/