Begin typing your search above and press return to search.

కేర‌ళ‌ గుడిలో వెల్లివిరిసిన మ‌త‌సామ‌ర‌స్యం..

By:  Tupaki Desk   |   24 Aug 2018 6:42 AM GMT
కేర‌ళ‌ గుడిలో వెల్లివిరిసిన మ‌త‌సామ‌ర‌స్యం..
X
మ‌నిషి పుట్టిన‌ప్పుడు మ‌తం లేదు.. కులం లేదు. ఎప్పుడైతే జాతి పెరుగుతూ వ‌చ్చిందో.. ఆటోమేటిక్ గా అన్ని వ‌చ్చాయి. రోజులు గడుస్తున్న‌కొద్దీ.. సాంకేతిక‌త అంత‌కంత‌కూ పెరుగుతున్న కొద్దీ మ‌తం.. కులం లాంటివి మ‌రింత విస్తృత‌మ‌వుతున్నాయే త‌ప్పించి త‌గ్గ‌ని దుస్థితి.

ఇలాంటి వేళ ప్ర‌కృతి ప్ర‌కోపించి.. మ‌నిషి ఎంత అల్పుడ‌న్న విష‌యాన్ని చెప్పిన వేళ‌.. మ‌నిషిలోని అస‌లు మ‌నిషి నిద్ర లేస్తున్నాడు. మ‌న‌మంతా ఒక‌టి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌ట‌మే కాదు మ‌తం గోడల్ని బ‌ద్ధ‌లు కొట్టేస్తున్నాడు. విశాల హృద‌యంతో ఒక‌రికొక‌రు ద‌గ్గ‌ర‌వుతున్నారు. కేర‌ళ‌ను అత‌లాత‌కుత‌లం చేసిన భారీ వ‌ర్షాలు.. వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో ఎవ‌రూ ఊహించ‌ని ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఒక‌విధంగా చెప్పాలంటే..కేర‌ళ‌లో ప్ర‌కృతి ప్ర‌కోపం ఏమో కానీ.. మ‌నుషుల్ని.. వారి మ‌న‌సుల్ని మ‌రింత ద‌గ్గ‌ర చేసింది. క‌ష్టంలో ఉన్న వాడికి చేత‌నైనంత సాయం చేయ‌టం.. వారి న‌మ్మ‌కాల్ని త‌మ న‌మ్మ‌కాలుగా భావించి.. పెద్ద మ‌న‌సుతో చేస్తున్న ప‌నులు ఇప్పుడు ప్ర‌పంచం దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తున్నాయి.

వ‌ర‌ద‌ల‌తో తీవ్ర ప్ర‌భావానికి గురైన త్రిసూర్ జిల్లాలోని కోచ్ క‌డ‌వులోని జుమా మ‌సీదును వ‌ర‌ద‌నీరు ముంచెత్తింది. దీంతో.. అక్క‌డికి స‌మీపంలోని ర‌త్నేశ్వ‌రి ఆల‌యంలోని హాలులో ముస్లింలు ఉన్నారు. బ‌క్రీద్ సంద‌ర్భంగా ఈద్ ప్రార్థ‌న‌లు చేసుకునేందుకు దేవాల‌య క‌మిటీ అంగీక‌రించింది. దీంతో.. దేవాల‌యంలో ప్రార్థ‌న‌లు చేసుకునే అపురూప‌మైన దృశ్యం ఆవిష్కృత‌మైంది.

బుధ‌వారం నాటికి వ‌ర‌ద నీరు త‌గ్గితే ఈద్ ప్రార్థ‌న‌లు చేసుకోవ‌చ్చ‌ని అనుకున్నామ‌ని.. కానీ వ‌ర‌ద తీవ్ర‌త త‌గ్గ‌క‌పోవ‌టంతో దేవాల‌య క‌మిటీని తాము ప్రార్థ‌న‌లు చేసుకోవాల‌ని కోరామ‌ని.. అందుకు వారు వెంట‌నే అంగీక‌రించిన‌ట్లుగా మ‌సీదు క‌మిటీ అధ్య‌క్షుడు పీఏ ఖ‌లీద్ వెల్ల‌డించారు. మొద‌ట మ‌న‌మంతా మ‌నుషులం.. అంద‌రం ఒకే దేవుని బిడ్డ‌లం అని గుర్తుంచుకోవాల‌ని ర‌త్నేశ్వ‌రి దేవాల‌య క‌మిటీ స‌భ్యుడు ఒక‌రు చెప్పిన‌ట్లుగా వారు వెల్ల‌డించారు.

దేవాల‌యంలో ముస్లింలు ప్రార్థ‌న‌లు చేసుకుంటున్న చిట్టి వీడియో క్లిప్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. బ‌క్రీద్ సంద‌ర్భంగా మెహందీలు పెట్టుకున్న వీడియోలు.. హిందూ దేవాల‌యాల్ని శుభ్రం చేస్తున్న ముస్లింల ఫోటోలు సోష‌ల్ మీడియాలో అల‌రిస్తున్నాయి. దేశంలో విల‌క్ష‌ణ‌మైన సంస్కృతికి.. మూర్తీభ‌వించిన మాన‌వ‌త్వానికి నిలువెత్తు రూపంగా నిలుస్తున్నాయి.

మ‌రోవైపు వ‌ర‌ద‌ల‌కు నిరాశ్ర‌యులైన ప‌లు హిందూ కుటుంబాలు మ‌ల్ల‌ప్పురం జిల్లా అక్కంపాడులోని చెలియార్ గ్రామం స‌మీపంలోని జుమా మ‌సీదులో ఆశ్ర‌యాన్ని క‌ల్పించారు. వ‌ర‌ద‌ల కార‌ణంగా నిలువ నీడ కోల్పోయిన 78 కుటుంబాల‌కు మ‌సీదులో వ‌స‌తి క‌ల్పించారు. వ‌ర‌ద నీటి కార‌ణంగా అప‌రిశుభ్రంగా మారిన వెన్నియాడ్ లో విష్ణుమూర్తి ఆల‌యాన్ని.. మ‌ల్ల‌ప్పురంలోని అయ్య‌ప్ప స్వామి ఆల‌యాన్ని కొంద‌రు ముస్లింలు శుభ్రం చేసిన తీరు ఇప్పుడు అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది.