Begin typing your search above and press return to search.

ఏడెనిమిదేళ్లు అక్రమ సంబంధం..ఆ తరువాత అత్యాచారం కేసు

By:  Tupaki Desk   |   10 Jun 2019 8:37 AM GMT
ఏడెనిమిదేళ్లు అక్రమ సంబంధం..ఆ తరువాత అత్యాచారం కేసు
X
ప్రధానిగా మోదీ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా బీజేపీకి ఆ పార్టీ నేతల నోటి దురద కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా మహిళల విషయంలో బీజేపీ నేతలు చేసిన కాంమెంట్లు గతంలోనూ పార్టీకి తలనొప్పులు తెచ్చాయి. ఇప్పుడు కూడా ఆపార్టీ నేతలు అదే తరహా మాట తీరుతో విపక్షాల చేతికి అస్త్రాలు అందిస్తున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌ బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నేత ఒకరు మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.

కొందరు ఆడవాళ్లు తమకు నచ్చిన వారితో ఏడెనిమిదేళ్లు అక్రమ సంబంధాన్ని పెట్టుకుని.. ఆ సంగతి బయటపడితే తమపై అత్యాచారం చేశారంటూ పురుషులపై కేసులు పెడుతున్నారని ఉత్తరప్రదేశ్ నీటి పారుదల - నీటి వనరుల శాఖా మంత్రి ఉపేంద్ర తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేప్ జరిగే తీరుపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువైపోయాయని ఆయన అన్నారు.

మైనర్లపై అత్యాచారం జరిగితే దాన్ని రేప్‌ అని అర్థం చేసుకోవచ్చని.. కానీ, 30-35 ఏళ్ల ఆడవాళ్లు వచ్చి తమను ఎవరో రేప్ చేశారని చెబితే నమ్మడమెలా అన్నారు. ఆ మంత్రి వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నాయకులు గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారని.. ఆ పార్టీ నేతలకు మహిళలంటే చులకన భావమని ఆరోపిస్తూ అక్కడి విపక్షాలు మండిపడుతున్నాయి.

అత్యాచార ఘటన తన దృష్టికి వస్తే - ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే స్పందిస్తున్నారని, కఠిన చర్యలకు ఆదేశిస్తున్నారని ఉపేంద్ర తివారీ వ్యాఖ్యానించారు. కాగా, ఈ నెలారంభంలో అలీగఢ్ వద్ద రెండు సంవత్సరాల చిన్నారి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి చెత్తకుండీల్లో వేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.