Begin typing your search above and press return to search.

మారకుంటే మరింత ముప్పు బాస్.. 3 రోజులకే లక్ష దాటేసింది

By:  Tupaki Desk   |   21 March 2021 4:56 AM GMT
మారకుంటే మరింత ముప్పు బాస్.. 3 రోజులకే లక్ష దాటేసింది
X
అవును.. తోక ముడిచిందని భావించిన కరోనా మరోసారి తన సత్తా చాటుతోంది. రెండో వేవ్ దేశంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఓపక్క కరోనా వ్యాక్సిన్ జోరుగా సాగుతూ.. ఇప్పుడిప్పుడే 45 ఏళ్లకు పైబడిన వారికి ఇస్తున్న వ్యాక్సిన్ మరికొద్ది రోజుల్లో మరికొందరికి ఇవ్వనుంది. అయితే.. అందుకు భిన్నంగా ఇప్పుడు రెండో వేవ్ తన సత్తాను చాటే ప్రయత్నం చేస్తుంది. దీనికి.. ప్రజలు పట్టించుకోకపోవటం కూడా మరిన్నికేసులు నమోదు కావటానికి కారణమవుతోంది.

అవసరం ఉన్నా లేకున్నా రోడ్ల మీదకు వెళ్లటం.. సరైన రక్షణ జాగ్రత్తలు తీసుకోపోవటం.. మొత్తంగా రద్దీ వాతావరణం.. పండగులు.. పబ్బాలకు చెక్ పెట్టేసే ఆలోచన లేని రీతిలో ప్రజలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటం కూడా పలు చోట్ల కేసులు పెరగటానికి కారణమవుతున్నాయి. దేశవ్యాప్తంగా కేవలం మూడు రోజుల వ్యవధిలోనే లక్ష మార్కును దాటేయటం గమనార్హం.

ఈ ఏడాదిలో మొదటిసారి ఇంత భారీగా కేసులు నమోదవుతున్న విషయం ప్రజల్లోకి సరిగా వెళ్లలేదనే చెప్పాలి. గడిచిన 111 రోజుల్లో అత్యధిక కేసులు నమోదు అవుతున్నది ఇప్పుడే. శనివారం వెలువడిన నివేదిక ప్రకారం దేశంలో ఒక్కరోజులో 27,126 కేసులు నమోదైనట్లుగా చెబుతున్నారు. ఈ కేసుల్లో అత్యధికం మహారాష్ట్ర అయితే.. తర్వాతి స్థానం పంజాబ్ .. తమిళనాడు.. మధ్యప్రదేశ్.. ఢిల్లీ.. గుజరాత్.. కర్ణాటక.. హర్యానాలో కరోనా పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరంఉంది.

రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీతో పోలిస్తే.. తెలంగాణలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే.. గురుకుల పాఠశాలలు.. హాస్టళ్లలో పరీక్షలు చేసే కొద్దీ పాజిటివ్ కేసులు భారీగా లెక్కల్లోకి వచ్చి చేరటం ఆందోళన కలిగించేస్తున్న పరిస్థితి. కొంతలో కొంత మెరుగైన అంశం ఏమంటే.. చాలామందికి రోగ లక్షణాలు లేకుండానే.. పాజిటివ్ ఫలితం రావటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏమైనా.. దేశంలో కేసుల సంఖ్య మరింత పెరగకుండా ఉండటం ప్రజల చేతుల్లోనే ఉందన్నది మర్చిపోకూడదు. ఇంత జరుగుతున్న తర్వాత కూడా మారకుంటే మాత్రం ముప్పు పొంచి ఉన్నట్లే.