Begin typing your search above and press return to search.

సిద్ధిపేట జిల్లాలో వందకు పైగా కుక్కల్ని అంత దారుణంగా చంపేశారట

By:  Tupaki Desk   |   29 March 2022 3:30 AM GMT
సిద్ధిపేట జిల్లాలో వందకు పైగా కుక్కల్ని అంత దారుణంగా చంపేశారట
X
కుక్కల బెడద పెరిగిపోతుందని భావిస్తే.. వాటిని సరైన పద్దతిలో నియంత్రించటం కష్టమేమీ కాదు. కానీ.. అందుకు భిన్నంగా దారుణమైన ఆలోచన చేసి కిరాతకంగా చంపేసిన దుర్మార్గం తాజాగా బయటకు వచ్చింది. తమ ప్రాంతంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని పేర్కొన్నారంటూ వందకు పైగా కుక్కల్ని ఒకేసారి విషపు ఇంజెక్షన్లు ఇచ్చేసి చంపేసిన ఆరాచకం తెలంగాణలో చోటు చేసుకుంది. మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో సాగిన ఆ ఆరాచకపు కాండ వివరాలు తెలిసినంతనే అయ్యో అనిపించక మానదు.

గ్రామానికి చెందిన ఒకరు తమ పెంపుడు కుక్క చనిపోవటంతో హైదరాబాద్ లోని స్టే యానిమల్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనే ఎన్జీవోకు సమాచారం ఇచ్చారు. దీంతో స్పందించిన సదరు ఎన్జీవో టీం.. సదరు గ్రామాన్ని సందర్శించింది.

ఈ సందర్భంగా వారు షాకింగ్ వివరాల్ని గుర్తించారు. కుక్కల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్థులు పంచాయితీకి ఫిర్యాదు చేయటంతో గ్రామ సర్పంచ్ దుర్మార్గమైన ప్లాన్ వేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

సర్పంచ్.. పంచాయితీ కార్యదర్శి ఇద్దరూ కలిసి కుక్కలకు విషపు ఇంజెక్షన్లు ఇచ్చి.. వందకు పైగా కుక్కల మరణాలకు కారణమయ్యారంటున్నారు. అనంతరం వాటి కళేబరాల్ని గ్రామ శివారులోని పాత బావుల్లో పడేసి పూడ్చేసినట్లుగా చెబుతున్నారు.

ఈ ఆరాచకంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే.. వారు స్పందించకపోవటం గమనార్హం. దీంతో వారు జాతీయ జంతు సంరక్షణ సంస్థ ప్రతినిధి మేనకాగాంధీకి సమాచారం అందించారు. మనతోటి జంతువుల్ని ప్రేమగా పెంచకపోయినా ఫర్లేదు. ఇలా దుర్మార్గంగా చంపేయటం మాత్రం అభ్యంతరకరం. ఈ ఉదంతంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.