Begin typing your search above and press return to search.

అత్తర్ వ్యాపారి డబ్బు లెక్క దొరికింది..మూడురోజుల పాటు కౌంటింగ్

By:  Tupaki Desk   |   26 Dec 2021 10:33 AM GMT
అత్తర్ వ్యాపారి డబ్బు లెక్క దొరికింది..మూడురోజుల పాటు కౌంటింగ్
X
ఆయనో అత్తర్ వ్యాపారి..మహా అయితే తన వ్యాపార సోమ్ముతో పాటు దాచుకున్న డబ్బు దాదాపు కోటి వరకు ఉండే అవకాశం ఉంది. కానీ గుట్టలుగా పేర్చిన నోట్ల కట్టలు ఆయన ఇంట్లో కనిపించాయి. రూ.2000, రూ.500 కట్టలు ఉన్న ఈ నోట్ల కట్టలను లెక్కించే సరికి మూడు రోజుల సమయం పట్టింది. మొత్తం రూ.178 కోట్లు ఉన్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీడైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్ టీ ఇంటలిజెన్స్ (డీజీజీఐ) అపెక్స్ అధికారులు సంయుక్తగా లెక్కింపు చేసి గుర్తించారు. ఇప్పటి వరకు పట్టుకున్న నగదులో ఇంత భారీ మొత్తం స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటి సారి అని అధికారులు తెలుపుతున్నారు. ఉత్తరప్రదేశ్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాన్పూర్ కు చెందిన ఫ్రాగాన్స్ కంపెనీ ప్రమోటర్ పీయూష్ జైన్ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు లభ్యం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు పట్టుబడ్డ వ్యక్తి సమాజ్ వాదీ పార్టీకి అత్యంత సన్నిహితుడుగా పేర్కొంటున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కాన్పూర్లోని పీయూష్ జైన్ ఇంట్లో సోదాలు జరగగా తాజాగా త్రిమూర్తి ఫ్రాగ్రన్స్ ఫ్రైవేట్ లిమిటెడ్ అహ్మదాబాద్ యూనిట్ పై డీజీజీఐ సోదాలు నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు. కాగా పీయూష్ జైన్ ఇంట్లో మొదటి రోజు రూ.150 కోట్లు అని తెలిపిన అధికారులు మూడురోజుల పాటు లెక్కించిన తరువాత రూ.178 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా లెక్కింపు ప్రక్రియ పూర్తయినా.. ఇంకా నగదు ఎక్కడెక్కడ ఉందో సెర్చ్ చేస్తున్నారని ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది. అంతేకాకుండా పన్ను ఎగవేతను ఏజెన్సీ మూల్యాంకనం చేస్తోందని తెలుపుతున్నారు. పారిశ్రామిక వర్గాల్లో లెక్కింపు చూపని భారీ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదని, కోట్ల విలువైన నగదును మాత్రమే స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

ఇప్పటి వరకు రికవరీ చేసిన నగదు అమ్మకాల ప్రక్రియలో భాగమేనని, ఇంకా రహస్యంగా డబ్బు ఉన్నట్లు తెలుస్తోందని అధికారులు అంటున్నారు. అయితే ‘పాన్ మసాలా కంపెనీ భారీ పన్ను ఎగవేతకు పాల్పడి అక్రమంగా సంపాదించినట్లు తెలిపారు. ట్రాన్స్ పోర్టు ఆవరణలో కూడా భారీ మొత్తం స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా పట్టుబడిన నగదులో ఎక్కువగా రూ.500, రూ.2000 నోట్లే ఎక్కువగా ఉన్నాయన్నారు. పన్నుల ఎగవేతతో పాటు నకిలీ ఇన్ వాయిస్ లతో ఇ-వే బిల్లలు లేకుండా రవాణా చేస్తున్నట్లు గుర్తించామన్నారు.

ఇదిలా ఉండగా భారీ నగదుతో పట్టుబడిన పీయూష్ ఇంటితో పాటు మహారాష్ట్ర, గుజరాత్లోని పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన నగదును సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ చట్టంలోని సెక్షన్ 67 నిబంధనల ప్రకారం ఎస్బీఐలో డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. ఇక పీయూష్ జైన్ రాష్ట్రంలోని ప్రతిపక్షంగా ఉన్న సమాజ్ వాదీ పార్టీకి సన్నిహితుడని తెలుస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తో కలిసి ఫర్ఫ్యూమ్ ను మార్కెట్లోకి విడుదల చేశారు. పీయూశ్, అఖిలేశ్ యాదవ్ తో కలిసి ఉన్న ఫొటోలను బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.