Begin typing your search above and press return to search.

#RussiaUkrainewar: 1000 మందికి పైగా సైనికులు మృతి

By:  Tupaki Desk   |   25 Feb 2022 3:20 PM GMT
#RussiaUkrainewar: 1000 మందికి పైగా సైనికులు మృతి
X
ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించి ముందుకు సాగుతున్న రష్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందా? అంటే ఔననే అంటోంది ఉక్రెయిన్ రక్షణ శాఖ. ఓవైపు రాజధాని వరకూ ఆక్రమించుకున్నామని రష్యా చెబుతుంటే.. మరోవైపు రష్యన్ సైనికులు 1000 మందిని చంపేశామని ఉక్రెయిన్ చెబుతోంది.

తాజాగా ఉక్రెయిన్ రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకూ 1000 మందికి పైగా రష్యా సైనికులను హతమార్చినట్టు ప్రకటించింది.

రష్యాన్ ఆర్మీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నట్టు వెల్లడించింది. రష్యాకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగేది లేదని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. మరోవైపు ఉక్రెయిన్ లో రష్యా యుద్ధం ఆపాలని ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

రష్యా సైనిక బలగాలకు చెందిన సైనికులను కీవ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న డైమెర్, ఇవాన్ కివ్ వద్ద ఉక్రెయిన్ బలగాలు ఎదుర్కొన్నాయని.. భీకర పోరు సాగిందని సమాచారం. ఈ ప్రాంతాల్లో రష్యాకు చెందిన సైనిక వాహనాలు భారీ సంఖ్యలో చేరుకున్నాయి.

రష్యా బలగాలు ముందుకు రాకుండా ఉండేందుకు టెటిరివ్ నది వద్ద ఉన్న బ్రిడ్జ్ ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. మరోవైపు బ్రిటన్ కు చెందిన విమానాలను రష్యా నిషేధించింది.

ఉక్రెయిన్ పై యుద్ధానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటడంతో పుతిన్ ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దించింది. దేశంలోని 53 పట్టణాల్లో సుమారు 1700 మందికిపైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఒక్క మాస్కోలోనే 900 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెయింట్ పీటర్స్ బర్గ్ లో 400 మంది నిరసనకారులను జైళ్లకు తరలించారు.

అంతకుముందు పలువురు జర్నలిస్టులు, మీడియా ప్రముఖులు రష్యా కార్యకలాపాలను ఖండిస్తూ ఓ పిటీషన్ పై సంతకం చేశారు. మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్, సమారా, రియాజాన్, సహా ఇతర నగరాల నుంచి వందమందికి పైగా మున్సిపల్ డిప్యూటీలు రష్యా పౌరులకు బహిరంగ లేఖపై సంతకం చేశారు.

ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులంతా ఉక్రెయిన్ పై సైన్యం దాడిని ఖండించారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. ఇది అసమానమైన దురాగతం అని.. దీనికి సమర్థన ఉన్నా ఈ హింసను సమర్థించకూడదు అని వెల్లడించారు.

రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇన్నాళ్లు అనధికారికంగా బాంబుల వర్షం కురిపించినా.. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇక యద్దం చేయడమేనని ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్ పై దశాబ్దాలుగా ఆధిపత్యం కోసం పరితపిస్తున్న రష్యాకు వ్యతిరేకంగా ఆ దేశం పోరాడుతోంది.

అయితే ఉక్రెయిన్ కు పశ్చిమ దేశాలు అండగా ఉంటున్నాయి. ఈ మద్దతు పై రష్యా ఇంకా మండిపడుతోంది. ఇక యుద్ధం చేయడం తప్ప మరో మార్గం లేదనే విషయాన్ని పుతిన్ చెప్పడం ఆందోళన వాతావరణం ఏర్పడింది.