జీహెచ్ ఎంసీ ఎన్నికల దెబ్బకు తెలంగాణలో కొత్త పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఈ వారం రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘంలో 45 కొత్త పార్టీలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయి. ఎన్నికల నాటికి ఈ సంఖ్య వందకు మించిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని అధికారులు బెంబేలెత్తి పోతున్నారు. తెలంగాణ పేరుతోనే ఇప్పటివరకు పదికి పైగా కొత్త పార్టీలు తమ పేర్లను నమోదు చేసుకున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఏ ఎన్నికల్లోనైనా ఎన్ని పార్టీలు పోటీ చేస్తాయి? ప‌్రధాన పార్టీలు నాలుగైదు.... చిన్నాచితకా పార్టీలు మహా అయితే ఒక పది, పదిహేను బరిలో ఉంటాయి. కానీ... త్వరలో జరగబోయే జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఎన్ని పార్టీలు పోటీ చేయొచ్చనుకుంటున్నారు? ఇదేమీ సాధారణ ఎన్నికలు కావు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలే బరిలో ఉంటాయని అనుకుంటాం.. నిజమే తెలుగు రాష్ట్రాల్లో పార్టీలే బరిలో ఉండబోతున్నాయి... కానీ, వాటి సంఖ్య 50కి మించిపోనుంది. 100కి చేరినా ఆశ్చర్యపోనక్కరలేని పరిస్థితి కనిపిస్తోంది. అదేంటి... ఏపీ - తెలంగాణల్లో అన్ని పార్టీలు ఎక్కడున్నాయి అనుకోవద్దు. కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. అవి కూడా పుట్టగొడుగుల్లా.... పుట్టలు పగిలి పాములు బయటకొచ్చినట్లుగా... అవును.. హైదరాబాద్ పరిధిలో కొత్త పార్టీలు లెక్కలేనన్ని రిజిష్టరవుతున్నాయి. ఇప్పటికే కొత్తగా 45 పార్టీలు రిజిష్టరయ్యాయి.
గ్రేటర్ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో కొత్త పార్టీలు పెట్టేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో ఆరు జాతీయ పార్టీలుండగా, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీలు ప్రాంతీయ పార్టీలుగా కొనసాగుతున్నాయి. జాతీయ పార్టీల్లో కాంగ్రెస్ - బీజేపీ - సీపీఎం - సీపీఐ - బీఎస్పీ - నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎంసీపీ) - ఎంఐఎంలు ఉన్నాయి. ఇవిపోను ఎన్నికల కోసం ఇప్పటికే కొత్త పార్టీలను పెడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుండడంతో ఎన్నికల సంఘం అధికారులు తికమక పడుతున్నారు.. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 20 మంది సంతకాలతో పార్టీని ఏర్పాటు చేసే అవకాశముంది. ఈ ఇరవై మంది పార్టీ పెట్టాలంటే వారి ఫొటోలు - సంతకాలు - పార్టీ వ్యవస్థాపకులు - పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే వారి వివరాలను ఇవ్వవలసి ఉంటుంది. ఎన్నికల సంఘం దరఖాస్తులను పరిశీలించి ఎన్నికల్లో పార్టీలకు ప్రత్యేకంగా ఎన్నికల గుర్తులను కేటాయిస్తారు. రెండు ప్రాంతీయ పార్టీలకు - ఆరు జాతీయ పార్టీలకు ఇప్పటికే ఆయా పార్టీలకు కేటాయించిన గుర్తులను కొనసాగిస్తారు.
పెద్దసంఖ్యలో కొత్త పార్టీలను ఏర్పాటు చేస్తుండడంతో గ్రేటర్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రం ఎంత పెద్దదిగా ముద్రించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అభ్యర్థుల సంఖ్య వందకు మించితే ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)లను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఇటీవల జరిగిన వరంగల్ ఉపఎన్నికల్లోనూ ప్రతి పోలింగ్ బూత్ లో రెండేసి ఈవీఎంలను ఏర్పాటు చేయడంతోపాటు బ్యాలెట్ పత్రంపై అభ్యర్థుల ఫొటోలను ముద్రించారు. గ్రేటర్ ఎన్నికల్లోనూ పోటీకి నిలబడే అభ్యర్థుల ఫొటోలను ముద్రించే అవకాశాలు లేకపోలేదని, అయితే ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని అందరితో చర్చించి తీసుకోవలసి ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. కొత్త పార్టీలు పుట్టగొడుగుల్లా ఏర్పాటు అవుతుండడంతో ప్రధాన రాజకీయ పక్షాల్లో ఆందోళన ప్రారంభమైంది. ఓట్లు చీలిపోతే అసలుకే ఎసరు వస్తుందన్న భయం వారిని వెంటాడుతోంది. ముఖ్యంగా తెలంగాణ పేరుతో కొత్త పార్టీల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరించే పనిలో నిఘా వర్గాలు నిమగ్నమయ్యాయి.
రాకరాక వచ్చిన గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రధాన రాజకీయ పక్షాలు తమదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహించుకునే పనిలో ఉండగా, కొత్త పార్టీలు వారిని కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రతిరోజూ పది మందికి పైగా ఎన్నికల సంఘం కార్యా లయానికి వస్తున్నారని, వీరంతా కొత్త పార్టీల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకే తమ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని అధికారులు పేర్కొం టున్నారు. పార్టీల ఏర్పాటుకు ఖచ్చితమైన నిబంధనలేవీ లేకపోవడంతో ఇది అదునుగా భావించి కొందరు ఒక సమూ హంగా ఏర్పడి పార్టీ కోసం దరఖాస్తులు పెట్టుకుంటున్నారని నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి ఆ తర్వాత తెరాసకు దూరమైన కొందరు సీనియర్లు ఇప్పటికే పార్టీ ఏర్పాటుకు ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకుంటున్నారు.