Begin typing your search above and press return to search.

అమెరికాలో లక్ష రెస్టారెంట్లకు కరోనా ఎఫెక్ట్

By:  Tupaki Desk   |   8 Dec 2020 10:17 AM GMT
అమెరికాలో లక్ష రెస్టారెంట్లకు కరోనా ఎఫెక్ట్
X
కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా కుదేలైన సంగతి తెలిసిందే. ఓ వైపు కరోనాను కట్టడి చేయడంలో ట్రంప్ సర్కార్ విఫలం కావడంతో లక్షలాది మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు, ట్రంప్ అవలంబించిన విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. కరోనా ధాటికి దాదాపు అన్ని రంగాలు చితికి పోయాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా దెబ్బకు అమెరికాలో దాదాపు 1,10,000 రెస్టారెంట్లు మూత పడ్డాయని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ వెల్లడించింది. గత 16 ఏళ్లుగా లాభాల్లో నడుస్తూ, విజయవంతంగా కొనసాగుతోన్న ఆ రెస్టారెంట్లన్నీ కరోనా దెబ్బకు పూర్తిగా మూతబడ్డాయని ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ రెస్టారెంట్ల ఓనర్లలో కేవలం 48శాతం మంది మాత్రమే తమ రెస్టారెంట్లను సమీప భవిష్యత్తులో తెరిచే అవకాశముందని చెబుతున్నారని వెల్లడించింది. కరోనా దెబ్బకు కుదేలైన రెస్టారెంట్ల రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఏదైనా చర్యలు చేపడుతుందని ఎదురుచూశామని, కానీ, ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో వాటిని మూసివేశామని రెస్టారెంట్ల ఓనర్లు చెబుతున్నారు. గత మూడు నెలల కాలంలోనే దాదాపు 10 వేల రెస్టారెంట్లు మూతపడడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు వాపోతున్నారు. ఈ సమస్యకు ప్రభుత్వం తరఫునుంచి పరిష్కారం లభించకపోతే త్వరలోనే మరికొన్ని వేల రెస్టారెంట్లు మూతపడే అవకాశముందని, వేలాదిమంది అమెరికన్లు బజారున పడతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సగం ఉద్యోగులతో 58 శాతం చెయిన్, ఇండిపెండెంట్ రెస్టారెంట్లు మరో 3 నెలలు వ్యాపారం కొనసాగించే ఉద్దేశ్యంలో ఉన్నాయని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ వెల్లడించింది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించకుంటే తీవ్ర ఇబ్బందులు పడతామని తెలిపింది. ఈ ప్రకారం ప్రభుత్వానికి ఓ లేఖ రాశామని వెల్లడించింది.