Begin typing your search above and press return to search.

ఐటీ ఉద్యోగుల‌కు కొత్త క‌ష్టాలు షురూ

By:  Tupaki Desk   |   9 Aug 2017 1:38 PM GMT
ఐటీ ఉద్యోగుల‌కు కొత్త క‌ష్టాలు షురూ
X
ఐటీ ఉద్యోగులు అన్న వెంట‌నే వారికుండే స‌దుపాయాలు.. క‌ళ్లు చెదిరే జీతాల గురించి మాత్ర‌మే అంటూ ఏడాపెడా మాట్లాడేసే వారు బోలెడంత మంది క‌నిపిస్తారు. కానీ.. వాస్త‌వం అందులో సుఖ‌మే. నాణెనికి బొమ్మ మాత్ర‌మే చూసే వారికి బొరుసు క‌నిపించ‌ని ప‌రిస్థితి. టార్గెట్ల క‌త్తి అంచున ప‌ని చేయ‌టం.. ఎప్ప‌టిక‌ప్పుడు మారే టెక్నాల‌జీకి త‌గ్గ‌ట్లుగా మార్చుకోవ‌టం.. విప‌రీత‌మైన ప‌ని ఒత్తిడి.. త‌ర‌చూ మారే కంపెనీ విధానాల కార‌ణంగా ప్ర‌భావితం కావ‌టం.. విదేశీ మార్కెట్లు.. ప్ర‌భుత్వ విధానాలతో ఉద్యోగ భ‌ద్ర‌త ఆధార‌ప‌డి ఉండ‌టం లాంటివెన్నో ప్ర‌తికూల‌త‌లు వారిని నిత్యం వెంటాడుతుంటాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. స‌మ‌యంతో సంబంధం లేకుండా త‌ర‌చూ మారే ప‌ని వేళ‌లు వారి జీవ‌న‌శైలిని.. ఆరోగ్యాన్ని తీవ్ర‌ప్ర‌భావితం చేస్తుంటాయి. ఇలాంటి స‌మ‌స్య‌లెన్నింటితోనో స‌త‌మ‌త‌మ‌య్యే ఐటీ జీవికి స‌రికొత్త స‌మ‌స్య ఒక‌టి వ‌చ్చి ప‌డింద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించింది తాజా నివేదిక‌. ఇటీవ‌ల కాలంలో వేగంగా మారుతున్న టెక్నాల‌జీకి అనుగునంగా నైపుణ్యాల్ని పెంపొందించుకోక‌పోతే ఉద్యోగ భ‌ద్ర‌త‌కు ఏ మాత్రం భ‌రోసా లేద‌న్న విష‌యాన్ని స‌ద‌రు నివేదిక చెబుతోంది.

ఇటీవ‌ల‌కాలంలో పెరుగుతున్న ఆటోమేష‌న్ నేప‌థ్యంలో ఐటీ ఉద్యోగులు త‌మ కెరీర్ లో మ‌రింత ముందుకు వెళ్ల‌టానికి వీలుగా కొత్త త‌ర‌హా స్కిల్స్ ను పెంపొందించుకోవాల‌ని.. లేకుంటే వారి ఉద్యోగం ఊడిపోవ‌టం ఖాయ‌మ‌ని స‌ద‌రు నివేదిక స్ప‌ష్టం చేస్తోంది. ఉన్న‌త స్థానాల్లోకి వెళ్లాల‌నుకునే ఐటీ నిపుణులు.. కొత్త కోర్సుల‌ను నేర్చుకోవ‌టానికి ల‌క్ష‌లాది రూపాయిలు ఖ‌ర్చు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొంది. గ‌తంలో ఉద్యోగికి అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ‌ను కంపెనీలు ఇచ్చేవ‌ని.. ఇప్పుడా ప‌రిస్థితి లేద‌ని చెబుతున్నారు.

కోచింగ్ కోసం దాదాపు రూ.4లక్ష‌ల వ‌ర‌కూ ఖ‌ర్చు చేయాల్సి ఉంద‌ని చెప్పిన స‌ద‌రు నివేదిక‌.. ఇందుకోసం ప‌ది నెల‌లు నుంచి ఏడాది వ‌ర‌కూ వ్య‌వ‌ధి ఉన్న కోర్సుల్ని చేయాల‌ని చెబుతోంది. గ‌తంలో మాదిరి త‌మ‌కున్న ఉద్యోగికి నైపుణ్యాన్ని పెంచే క‌న్నా.. నైపుణ్యం ఉన్న ఉద్యోగిని నేరుగా ఎంపిక చేసుకోవ‌టానికి వీలుగా కంపెనీలు నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ట్లుగా చెబుతున్నారు. ఉద్యోగం వ‌చ్చాక లైఫ్ సెటిల్ కావ‌టం అన్న‌ది పాత మాట అని.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మ‌ధ్య‌స్థాయిలో మేనేజ‌న్లుగా ఉన్న చాలామంది ఐటీ ప్రొఫెష‌న‌ల్స్ రీస్కిల్స్ కోసం ఆన్ లైన్ కోర్సుల్ని ఆశ్ర‌యిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఇత‌ర సంస్థ‌ల్లో కోర్సులు చేసే క‌న్నా.. ఆన్ లైన్ కోర్సులైతే ఖ‌ర్చు త‌క్కువ‌గా ఉంటుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. డేటా అనాలిటిక్స్‌.. మిస‌న్ లెర్నింగ్‌.. ఐఆర్ (ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్‌).. క్లౌడ్.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి కొత్త టెక్నాల‌జీ కోర్టుల‌కే ప్రస్తుతం ఉపాధి అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు మారే ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా ఐటీ ఉద్యోగులు మార‌క‌పోతే.. వారి ఉద్యోగాలే మారిపోతాయ‌న్న అభిప్రాయం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. తాజా ప‌రిణామాలు ఐటీ జీవులకు కొత్త క‌ష్టాల్ని తెచ్చి పెడుతున్న‌ట్లుగా చెబుతున్నారు.