Begin typing your search above and press return to search.

సుంద‌ర్ పిచాయ్.. న‌మ్మ‌కం కోల్పోయాడా?

By:  Tupaki Desk   |   5 Feb 2019 9:58 AM GMT
సుంద‌ర్ పిచాయ్.. న‌మ్మ‌కం కోల్పోయాడా?
X
సుంద‌ర్ పిచాయ్.. దేశ యువ‌త‌కు ఆద‌ర్శం. చెన్నైలో ఒక సాధార‌ణ కుటుంబంలో పుట్టి ప్ర‌పంచ అగ్ర‌గామి సంస్థల్లో ఒక‌టైన గూగుల్‌ కు సీఈవో అయ్యాడ‌త‌ను. అత‌డి ఎదుగుద‌ల అంద‌రికీ ఆద‌ర్శం. చాలా సింపుల్‌ గా క‌నిపించే అత‌ను.. చాలా ఏళ్లుగా గూగుల్ అభివృద్ధిలో కీల‌కంగా ఉంటున్నాడు. సుంద‌ర్ ఏంటి.. గూగుల్ సీఈవో ఏంటి అన్న వాళ్ల నోళ్లు మూయించి త‌న ప‌నితీరుతో ప్ర‌శంలందుకున్నాడు. ప్ర‌పంచ అత్యుత్త‌మ సీఈవోల్లో ఒక‌డ‌నిపించుకున్నాడు. కానీ ఇప్పుడు సుంద‌ర్ ప‌నిత‌నంపై సందేహాలు రేకెత్తుతున్నాయి. సుంద‌ర్ మీద సందేహాలు వ్య‌క్తం చేస్తున్న‌ది వేరెవ‌రో కాదు.. గూగుల్ ఉద్యోగులే. ముందు నుంచి ఉద్యోగుల ఫేవ‌రెట్‌ గా ఉంటూ వ‌చ్చిన సుంద‌ర్‌ పై ఇప్పుడు న‌మ్మకం స‌డ‌లుతోంద‌ట‌. సుంద‌ర్ ప‌నితీరుపై అంత‌ర్గ‌తంగా నిర్వ‌హించిన స‌ర్వేలో.. అత‌డిపై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైన‌ట్లు స‌మాచారం. గ‌తంలో సుంద‌ర్ ప‌నితీరు విష‌యంలో స‌ర్వే నిర్వ‌హిస్తే నూటికి 90 శాతానికి పైగా పాజిటివ్‌ గా స్పందించేవారు. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితులు లేవు. ఉద్యోగులు సుంద‌ర్ మీద అప‌న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశార‌ట‌.

ఎంతో పార‌ద‌ర్శ‌కంగా న‌డిచే.. ఉద్యోగుల‌కు పూర్తి స్వేచ్ఛ‌నిచ్చే సంస్థ‌ల్లో గూగుల్ ఒక‌టి. ఆ స్వేచ్ఛే మంచి ప‌నితీరుకు కార‌ణం అవుతుంద‌ని గూగుల్ భావిస్తుంది. ప్ర‌తి విష‌యంలోనూ ఉద్యోగుల భాగ‌స్వామ్యం, అభిప్రాయం కీల‌కంగా ఉంటుంద‌క్క‌డ‌. ఎవ్వ‌రైనా త‌మ అభిప్రాయాన్ని నిర్మొహ‌మాటంగా చెప్పొచ్చు. అంత‌ర్గ‌తంగా అంద‌రి ప‌నితీరుపై పార‌ద‌ర్శ‌కంగా మ‌దింపు చేస్తార గూగుల్‌ లో. ఈ కోవ‌లోనే సుంద‌ర్ ప‌నితీరుపై సర్వే చేయ‌గా వ్య‌తిరేక‌త క‌నిపించిన‌ట్లు తెలుస్తోంది. 89 శాతం మంది గూగుల్ ఉద్యోగులు పాల్గొన్న ఈ స‌ర్వేలో..పిచాయ్ పనితీరు సంస్థ మరింత ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు 78 శాతం మందే ఆమోదం తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఇది 10 శాతం వ‌ర‌కు త‌గ్గింది. పిచాయ్ మేనేజ్‌ మెంట్‌ ఇలానే కొనసాగితే భవిష్యత్‌లో గూగుల్ మరింత ప్ర‌భావ‌వంతంగాగా మారుతుందా అని అడిగితే 74 శాతం మందే సానుకూలంగా స్పందించారు. ఈ ప్ర‌శ్న‌కు నిరుడు 92 శాతం మంది పాజిటివ్‌ గా స్పందించారట. పిచాయ్ నిర్ణయాలు వ్యూహాలు సంస్థకు ఎంతవరకూ ఉపయోగపడుతున్నాయనే ప్ర‌శ్నించ‌గా...75 శాతం మంది పాజిటివ్‌ గా స్పందించగా.. గతేడాదితో పోలిస్తే 13 శాతం తగ్గింది. మొత్తంగా చూస్తే సుంద‌ర్ మీద మునుపెన్న‌డూ లేని విధంగా ఉద్యోగుల్లో వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంద‌న్న‌ది స్ప‌ష్టం. ఈ నేప‌థ్యంలో అత‌డి భ‌విత‌వ్యం ఎలా ఉంటుందో చూడాలి.