Begin typing your search above and press return to search.

మారటోరియం వడ్డీ మాఫీ.. మళ్లీ విచారణ వాయిదా !

By:  Tupaki Desk   |   5 Oct 2020 5:30 PM GMT
మారటోరియం వడ్డీ మాఫీ.. మళ్లీ విచారణ వాయిదా !
X
కరోనా విజృంభణ , దాన్ని అరికట్టే నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో రుణ గ్రహీతలకు 6 నెలల పాటు లోన్ మారటోరియం విధించింది. ఈ రుణాలపై వడ్డీ పై వడ్డీ మాఫీ కోరుతూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. దీనికి సంబంధించి విచారణ మరోసారి వాయిదా పడింది. సోమవారం వాదనలు విన్న జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఆర్ సుభాష్ రెడ్డి, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం... ఆరు నెలల లోన్ మారటోరియం నిషేధ కాలంలో వడ్డీని వదులుకోవాలని సూచించింది. వడ్డీ పైన వడ్డీ మాఫీకి కేంద్రం అంగీకారం తెలిపింది. అదనపు అఫిడవిట్లు చేయడానికి ఆర్బీఐ ,కేంద్రానికి ఒక వారం గడువు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 13 వ తేదీకి వాయిదా వేసింది.

అన్ని అఫిడవిట్లను అక్టోబర్ 12వ తేదీ నాటికి సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మరుసటి రోజు ఉంటుందని తెలిపింది. పాలసీ నిర్ణయాలు, అమలు, వడ్డీలు మళ్లీ లెక్కగట్టేందుకు మార్గదర్శకాల జారీ, నోటిఫికేషన్స్, సర్క్యులర్ల జారీ వంటి వాటికి సంబంధించిన వివరాల సమర్పణకు ఈ సమయం ఇచ్చింది. అయితే గత నెల 10న దాఖలు చేసిన అఫిడవిట్ సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సంబంధించి అవసరమైన వివరాలను ఇవ్వలేదని తెలిపింది.

మారటోరియం కాలంలో వ్యక్తిగత రుణ గ్రహీతలు, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలకు కేంద్రం భారీ ఊరట కల్పించింది. ఆయా రుణాల వడ్డీపై వడ్డీని మాఫీ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. రుణ గ్రహీతలకు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది కేంద్రం. మారటోరియంలో వడ్డీపై వడ్డీ వదులుకొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో..ఆరు నెలల్లో రూ. 2 కోట్ల వరకు ఉన్న రుణాలపై వడ్డీ వదులుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మార్చి నుంచి ఆగస్ట్ మధ్య చెల్లించని రుణాలపై వడ్డీ మీద వడ్డీ భారం పడదని అఫిడవిట్‌లో పేర్కొంది. దీంతో ఈ నిర్ణయం లక్షలాది రుణగ్రహీతలకు ఊరట లభించినట్లయింది. గతంలో ఎప్పుడూ లేని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం వద్ద ఉన్న పరిష్కారం వడ్డీపై వడ్డీ భారాన్ని ఎత్తివేయడమేనని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన అఫిడవిట్ ‌లో పేర్కొంది. ఈ చక్రవడ్డీల భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని తెలిపింది.