Begin typing your search above and press return to search.

శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్: తిరుపతి నుండి తిరుమలకు మోనోరైలు!

By:  Tupaki Desk   |   23 Feb 2020 1:16 PM GMT
శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్: తిరుపతి నుండి తిరుమలకు మోనోరైలు!
X
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనాన్ని భక్తులకు మరింత సులభతరం చేసేలా తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు తిరుపతి నుండి తిరుమల కొండపైకి వెళ్లేందుకు మోనో రైలును అందుబాటులోకి తేవాలని చూస్తోంది. స్వామివారి పవిత్రతకు భంగం లేకుండా - ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి - హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి భేటీ అయ్యారు. వీరి భేటీ సందర్భంగా లైట్ మెట్రో రైలు సిస్టం అంశం చర్చకు వచ్చిందని తెలుస్తోంది. తిరుమలలో ర్యాపిడ్ ట్రాన్సుపోర్ట్ సిస్టమ్‌ ను తీసుకువచ్చే అంశంపై చర్చించారు. ఇటీవల ఎన్వీఎస్ రెడ్డి.. వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు వెళ్లినప్పుడు చర్చ జరిగిందట.

శ్రీవారిని దర్శించుకోవడానికి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల నుండి తిరుపతికి అనుసంధానించేలా రైలు ఆధారిత పరిష్కారం ఏదైనా ఉంటుందా అని మెట్రో రైల్ చీఫ్‌ ను టీటీడీ చీఫ్ అడిగారట. ఈ సందర్భంగా లైట్ మెట్రో వెహికిల్ సిస్టం‌ను ఎన్వీఎస్ రెడ్డి సూచించారు.

ఈ నేపథ్యంలో తిరుపతి నుండి తిరుమలకు మోనో రైలు - లైట్ మెట్రోలను పరిశీలిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ చెబుతున్నారు. తిరుమల కొండల్లో ఎలాంటి తవ్వకాలు లేకుండా ఉన్న మార్గాల్లోనే మోనో రైలు అవకాశాలు పరిశీలించాలని మెట్రో రైలు ఎండీని టీటీడీ చీఫ్ కోరారు. ఆస్ట్రియాలో ఎత్తైన కొండపైకి మోనో రైలు మార్గం ఉందని - దానిని ప్రాతిపదికగా తీసుకొని తిరుమలకు రైలు సౌకర్యాన్ని పరిశీలిస్తున్నామని చెబుతున్నారు.