Begin typing your search above and press return to search.

ఏడుకొండలపైకి ఏక పట్టా రైలు

By:  Tupaki Desk   |   28 Oct 2015 8:38 AM GMT
ఏడుకొండలపైకి ఏక పట్టా రైలు
X
తిరుమల కొండల్లో రైలు పరుగులు తీయనుందా..? పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని తితిదే ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను అన్వేషిస్తోందా..? తిరుపతి-తిరుమల మధ్య రైల్వే లైను ఏర్పాటుకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల దీనిపై సర్వే కూడా నిర్వహించారని సమాచారం. తమిళనాడు రాష్ట్రంలోని పళణి ఆలయానికి మోనో రైలు ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇచ్చిన విధంగానే తిరుపతి- తిరుమల మధ్య కూడా మోనో రైలును నడపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను ఇప్పటికే పరిశీలించి కేంద్రం సానుకూలత తెలిపిందని సమాచారం. అర్బన్ మాస్ ట్రాన్స్ పోర్ట్ అనే సంస్థ ఇటీవల తిరుమల కొండల్లో సర్వే చేసి మోనో రైలు మార్గం నిర్మాణం సాధ్యమే అని తేల్చిందట.
కాగా తిరుమలకు మోనో రైల్వే లైను నిర్మాణం - ఇంజన్లు - వంద బోగీల కొనుగోలుకు రూ.3,510 కోట్లు ఖర్చు అవుతుందని ఆ సంస్థ అంచనా వేసింది. 27 కిలోమీటర్ల దూరం వేసే రైల్వే లైనుకు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి వివరాలను తిరుపతి పార్లమెంటు సభ్యులు వరప్రసాద్ కేంద్రానికి వివరించారు. దీనికి సంబంధించిన వ్యయం అంతా కేంద్ర పట్టాణాభివృద్ధి శాఖ భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ రైలు వేస్తే ఒక ట్రిప్పుకు 500 మంది ప్రయాణించే వీలుంటుంది.

ఏడుకొండలపైకి రైలు మార్గం పూర్తయితే ప్రమాదకర ఘాట్ రోడ్డు ప్రయాణ బాధలు కొంతవరకు తగ్గుతాయి. అంతేకాదు ఎత్తయిన కొండలు..జాలువారే జలపాతాలు...పచ్చదనాన్ని చూస్తూ హాయిగా రైలు ప్రయాణం చేయొచ్చు. అయితే... గతంలో కొండపైకి రోప్ వే, చిత్తూరు జిల్లాకు గాలేరు ప్రాజెక్టును తిరుమల గిరుల సొరంగం ద్వారా మళ్లింపు ప్రతిపాదనలపై ఆగమశాస్త్ర పండితులు అడ్డుకున్నారు. వీటి వల్ల తిరుమల పవిత్రత దెబ్బతింటుందని అప్పట్లో వాదించారు. ఇప్పుడు మోనో రైలు ప్రతిపాదనకూ వారి నుంచి అభ్యంతరం వ్యక్తం కావచ్చన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.