Begin typing your search above and press return to search.

కుక్కలు కనిపిస్తే చాలు మూకుమ్మడిగా చంపేస్తున్నాయి

By:  Tupaki Desk   |   19 Dec 2021 8:10 AM GMT
కుక్కలు కనిపిస్తే చాలు మూకుమ్మడిగా చంపేస్తున్నాయి
X
ఇలాంటి సీన్ ఇంతకు ముందెప్పుడూ చూసింది లేదు. ఆ మాటకు వస్తే.. ఇలా జరుగుతుందన్నది విన్నది లేదు. పాములు పగబడతాయన్న మాట విన్నాం కానీ.. కోతులు పగబడతాయని... అదే పనిగా ఒక జాతి జంతువుల్ని టార్గెట్ చేసి చంపేస్తాయన్న మాటను విననది లేదు. కానీ.. అందుకు భిన్నంగా అనూహ్యమైన ఉదంతాలు ఇప్పుడు మహారాష్ట్రలో చోటు చేసుకుంటున్నాయి. విన్నంతనే.. ఇదేదో సినిమా కథలా అనిపించినా ఇది నిజం. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న వరుస ఉదంతాలు అక్కడ హాట్ టాపిక్ గా మారటమే కాదు.. కోతుల్లో ఇలాంటి విపరీత వైఖరికి జనాలు సైతం హడలిపోతున్నారు.

ఇంతకూ జరిగిందేమంటే.. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఒక కోతిపిల్లను కొన్ని కుక్కలు దాడి చేసి చంపాయి. అంతే.. ఈ ఉదంతం చోటు చేసుకున్న నాటి నుంచి సీన్ మారిపోయింది. కుక్కలు కనిపిస్తే చాలు.. కోతులు వాటి మీద దాడి చేస్తున్నాయి. మూకుమ్మడిగా విరుచుకుపడుతూ చంపేస్తున్నాయి. పగతో రగిలిపోతున్న కోతుల దాడితో కుక్కలు వరుసగా చనిపోతున్నాయి. ఎక్కడ కుక్క కనిపించినా సరే.. ఒక్కసారిగా వాటి మీద పడటం.. కాళ్లతో వాటిని పట్టుకెళ్లి.. ఎత్తైన భవనాల మీద నుంచి కిందకు వదిలేస్తున్నాయి.దీంతో.. అవి కాస్తా చనిపోతున్నాయి.

గడిచిన నెల వ్యవధిలో ఏకంగా 250 కుక్క పిల్లల్ని చంపేశాయి. దీంతో.. ఇళ్లల్లో కుక్కల్ని పెంచుకునే వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కోతి పిల్లను చంపేశారన్న పగతో రగిలిపోతున్న కోతులు విపరీత వైఖరితో వ్యవహరించటం హడలెత్తించేలా మారింది. మహారాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉండే లవూల్ గ్రామంలో ఇప్పుడు ఒకే ఒక్క కుక్క పిల్ల మిగిలినట్లుగా చెబుతున్నారు. కోతుల తీరుపై తాజాగా కుక్క యజమాని ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.