Begin typing your search above and press return to search.

కోతి రచ్చతో 20 మంది చనిపోయారు

By:  Tupaki Desk   |   24 Nov 2016 6:34 AM GMT
కోతి రచ్చతో 20 మంది చనిపోయారు
X
చిన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారి.. ఏకంగా 20 మంది ప్రాణాలు తీసిన ఘటన ఇది. మన ఊళ్లలో తరచూ ఒక మాటను చెబుతుంటారు. పురాణ కాలం నుంచి ఇప్పటి వరకూ గొడవలు రెండే రెండింటి వల్ల వస్తాయని.. అందులో మొదటిది డబ్బు.. రెండోది అమ్మాయి. మన దగ్గరే కాదు.. ప్రపంచం మొత్తం మీదా జరిగే గొడవలన్నీ ఈ రెండింటిలో ఏదో ఒకటి దానితోనే ఉంటుందన్న విషయం తాజాగా లిబియాలో సాభా నగరంలో చోటుచేసుకున్న ఘటనను చూస్తే అర్థమవుతుంది.

20 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఆడపిల్లలు స్కూలు నుంచి ఇంటికి వెళుతున్నప్పుడు కోతుల్ని ఉసిగొల్పి అక్కడి వారు మర్కట ఆనందాన్ని పొందుతుంటారట. ఇలానే కొద్దిరోజుల కిందట ఒక అమ్మాయి మీదకు కోతిని ఉసిగొల్పాడో కుర్రాడు. అమ్మాయి మీదకు దుమికిన కోతి.. ఆ స్కూల్ అమ్మాయి చేతిని కొరికి.. ఆమె స్కార్ఫ్ ను లాక్కెళ్లింది. దీంతో.. ఇంటికి వెళ్లిన ఆ అమ్మాయి ఇంట్లో వాళ్లకు విషయాన్ని చెప్పింది.

దీన్ని సీరియస్ గా తీసుకున్న వారు.. కోతి యజమాని వద్దకు వెళ్లి.. తమకు న్యాయం చేయాలని కోరటం.. అందుకు అతగాడు నో అంటే నో అని చెప్పేయటంతో విషయం మరింత ముదిరింది. ఈ విషయం ఇక్కడితో ఆగకుండా.. కోతి యజమానికి సంబంధించిన తెగ వారు అతనికి అండగా నిలవటంతో.. బాధిత అమ్మాయి తరపు వాళ్లంతా ఒక్కటై.. అమ్మాయి పక్షంగా మారారు. ఇలా ఈ గొడవ పెరిగి.. పెద్దదై రెండు తెగల మధ్య పూర్తిస్థాయి యుద్ధంగా మారింది.

దీంతో.. సాభా నగరంలో ఒక్కసారి అల్లర్లు మొదలయ్యాయి. చిన్న విషయం కాస్తా పరువు యుద్ధంగా మారింది. నడి వీధుల్లోకి వచ్చిన ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. చివరకు.. రెండు వర్గాల వారు హోవిడ్జర్ ఫిరంగులు వాడుకునే వరకూ విషయం వెళ్లింది. అర్థరాత్రి వేళ కూడా రోడ్ల మీద యుద్ధట్యాంకులు సంచరిస్తున్నాయి. ఈ హింసాకాండలో ఇప్పటివరకూ 20 మంది మరణించగా.. 60 మంది వరకూ గాయపడినట్లుగా తెలుస్తోంది. ఈ ఇష్యూలో మనుషులే కాదు.. దీనంతటికి కారణమైన కోతి కూడా చనిపోయినట్లుగా తెలుస్తోంది. బాలిక మీద కోతిని ఉసిగొల్పిన వ్యక్తి వివరాలు మాత్రం బయటకు రాలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/