Begin typing your search above and press return to search.

మీసేవ కేంద్రాల్లో నగదు విత్ డ్రా

By:  Tupaki Desk   |   29 July 2018 8:15 AM GMT
మీసేవ కేంద్రాల్లో నగదు విత్ డ్రా
X
పెద్ద నోట్ల తర్వాత జనాలకు నగదు కొరత అనివార్యమైంది. ఇప్పటికీ ఏటీఎంలలో డబ్బులు ఉండడం లేదు.ఈ సమస్యను తీర్చేందుకు తాజాగా తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు - ఏటీఎంల నుంచే కాకుండా మీ సేవా సెంటర్ల నుంచి కూడా మనీ విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించనుంది. జూలై 30 సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మీసేవా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మీసేవా రాష్ట్ర కమిషనర్ జీటీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆధార్ బేస్ డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా విత్ డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తామని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో 4,500 మీసేవా కేంద్రాలు ఉన్నాయని.. బ్యాంకు ఏటీఎంలు అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల కోసమే ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తొలిసారి అమల్లోకి తెస్తోందని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి రోజుకు రూ.2 వేలు మాత్రమే విత్ డ్రాకు అవకాశముందని.. త్వరలోనే రోజుకు రూ.10వేలు విత్ డ్రాకు పెంచుతామని తెలిపారు. ఇందుకోసం ఎలాంటి టాక్స్ వసూలు చేయబోమన్నారు. 30వ తేదీన కరీంనగర్ - నిజామాబాద్ - ఖమ్మం - మహబూబ్ నగర్ జిల్లాలోని 60 మీసేవ కేంద్రాల్లో ఈ సౌకర్యం ప్రారంభిస్తున్నట్టు వివరించారు. నెల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాల్లో ఈ క్యాష్ విత్ డ్రాను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు.